ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మధ్య ఎడతెగని పోరు సాగుతోంది. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలోని లొసుగును పట్టుకుని ఉండవల్లి ఇరికించారు. ఇదంతా దివంగత వైఎస్సార్ హయాంలో చోటు చేసుకుంది. అప్పట్లో తనపై వైఎస్సార్ కక్ష సాధింపు చర్యలకు దిగారని రామోజీరావు గగ్గోలు పెట్టారు. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకునేందుకు రామోజీ యత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన అభాసుపాలయ్యారు.
తన మీడియా గ్రూప్‌ను అడ్డు పెట్టుకుని నచ్చని నాయకుల జీవితాలతో ఆడుకునే రామోజీకి, ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. వైఎస్సార్ మరణానంతరం కూడా రామోజీపై ఉండవల్లి న్యాయ పోరాటం సాగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోడానికి ఎవరూ సాహసించరన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది పచ్చి అబద్ధమన్నారు. రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ స్థానంలో మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ తనదే అని రామోజీ అన్నారని గుర్తు చేశారు. మరోసారి కాదన్నారని పేర్కొన్నారు. తాను చెప్పే ప్రతి అంశానికి డాక్యుమెంటరీ అధారం వుందన్నారు.
అసలు మార్గదర్శి రామోజీదా? కాదా? అనేది తేల్చాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రామోజీరావుకు చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధం ఉందా లేదా? మార్గదర్శితో రామోజీకి సంబంధం లేకుంటే కేసు విత్‌డ్రా చేసుకుంటానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే అభియోగంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉండవల్లి ఆఫర్‌ను రామోజీ ఎలా వినియోగించుకుంటారనేది చర్చనీయాంశమైంది.