కాదేదీ రాజకీయానికి అనర్హమని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రుజువు చేస్తోంది. ఇటీవల కృష్ణా జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ ఎవరో ఆకతాయి గులక రాయి విసిరారట. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయమైంది. అసలే ప్రచార ఆకలి మీద ఉన్న టీడీపీకి గులకరాయి కాస్త అస్త్రమైంది.
చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇంతటితో వ్యవహారం ముగిసిపోయిందని అనుకున్నారు. అబ్బే… గులకరాయిని విడవమని టీడీపీ అంటోంది. ఆ గులక రాయితో జగన్ ప్రభుత్వంపై రాజకీయ దాడి చేయడానికే నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టీడీపీ దుష్ప్రచార కమిటీ తెరపైకి వచ్చింది. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ బృందం కలిసింది. చంద్రబాబు అంతటి నాయకుడిపై గులకరాయితో దాడి చేస్తే ….నామమాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేయడం ఏంటని టీడీపీ టీం ప్రశ్నించడం గమనార్హం.
అలిపిరిలో చంద్రబాబు దాడి ఘటనపై సిట్ బృందంతో విచారణ చేయించాలనే తరహాలో వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ బృందం హడావుడి చేస్తోంది. గులకరాయిపై దాడికి సంబంధించి రాష్ట్రపతి, ప్రధాని, వీలైతే అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులను కలిసే అవకాశం ఉందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని విసిరిన వ్యంగ్యాస్త్రాలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
బాదుడే బాదుడంటే తననే బాదాలని చంద్రబాబు కోరుతున్నాడని ఎవరో టీడీపీ ఆకతాయి గులక రాయి విసిరి వుంటారని కామెంట్స్ చేయడం విశేషం. గులకరాయి దాడిపై టీడీపీ ఓవరాక్షన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం టీడీపీ రాజకీయంగా విసిరే దుష్ప్రచార రాళ్లతో పోలిస్తే… గులకరాయి ఏ పాటిదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.