జనగణమన సినిమా చూసిన తర్వాత దశాబ్దాల క్రితం సెన్సేషన్‌గా మారిన దాదార్ ఎక్స్‌ప్రెస్ రేప్ కేస్ గుర్తొచ్చింది. ఈ కేసులో నిందితులు తెలియదు. బాధితులు ఎవరో తెలియదు. జరిగిందో లేదో ఇప్పటికీ తెలియదు. కానీ దేశ వ్యాప్తంగా ఇది సంచలనం.
1988-89లో అనుకుంటా. సరిగా గుర్తు లేదు. నేను తిరుపతిలో కుర్ర జర్నలిస్ట్‌ను. ఒకరోజు ఒక పత్రికలో సెన్సేషన్ వార్త, ఫస్ట్ పేజీలో బాక్స్. మద్రాస్ నుంచి దాదార్ వెళ్లే రైలులో ముగ్గురు యువతులపై అత్యాచారం జరిగింది. వాళ్లు కడపలో దిగి వెళుతూ, ఏడుస్తూ అక్కడున్న వాళ్లకు చెప్పారు. పోలీసులకి కంప్లైంట్ లేదు. ఈ వార్తని మిగతా అన్ని పత్రికలు మిస్ అయ్యాయి. దాంతో రిపోర్టర్ల ఉద్యోగాలు ఊడే స్థితి. మరుసటి రోజు దీన్ని ఫాలోఅప్‌గా అందరూ తమకు తోచిన కథనాలు రాశారు. కొందరు కళ్లతో చూసినట్టు వెనుక బోగీల్లో అత్యాచారం జరిగిందని రాశారు. రకరకాల ఊహాగానాలు. రాజకీయంగా అంటుకుంది. మహిళా సంఘాల ధర్నాలు, నిరసనలు. దేశ వ్యాప్తంగా సెన్సేషన్, పోలీసుల హడావుడి. ఎందరో అమాయకుల్ని లాకప్‌లో చావకొట్టారు.
కిటకిటలాడే రైలులో అత్యాచారం సాధ్యమా? అనే డౌట్ రాలేదు. ఎవరో చెప్పిన మాటలు విని విలేకరి రాసేశాడు. కొద్ది రోజులు ఫస్ట్ పేజీలో కనిపించి తర్వాత మాయమైంది. వాస్తవం ఎవరికీ తెలియదు. అనుమానితులుగా స్టేషన్లో దెబ్బలు తిన్న వాళ్లు చాలా కాలం ఆస్పత్రుల్లో వున్నారు. వాళ్లలో ఎక్కువ మంది పేదవాళ్లు, దళితులు. రూపం, పేరు చూసి నేరస్తులుగా నిర్ధారించే వ్యవస్థ మనది. ఇప్పటికీ ఏం మారలేదు.
1998లో చిత్తూరు జిల్లాలో జరిగిన నరహంతకుల కేసులో కూడా మీడియా చేసిన తప్పులకి ఎంతో మంది అమాయకులు జైళ్లలో మగ్గారు. వరుసగా హత్యలు జరుగుతూ వుంటే రకరకాల కథనాలు వచ్చేవి. సెల్ఫోన్లు లేని కాలం కాబట్టి కమ్యూనికేషన్ తక్కువ. దాంతో వార్తలు మిస్ అవుతామనే భయంతో విలేకరులు పుకార్లను కూడా కథనాలుగా రాసేవాళ్లు.
తిరుమల దర్శనానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జీపులు, వ్యాన్లలో భక్తులు వచ్చే వాళ్లు. వాళ్ల ఎక్కడైనా గ్రామాల దగ్గర దిగి టీ తాగినా “సంచరిస్తున్న అనుమానితుల ముఠా” అని వార్త వచ్చేది. దాంతో పోలీసులు వాళ్లని చావబాదే వాళ్లు. లాకప్‌లన్నీ గడ్డాలు పెంచుకున్న వాళ్లతో (మొక్కు కోసం వచ్చిన వాళ్లు) నిండిపోయేది.
ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో అత్త ఆరళ్లు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది. వార్త డెస్క్‌కి చేరింది. ఆ రోజుల్లో డెస్క్ సబ్ ఎడిటర్లలో కవిత్వం పొంగిపోర్లేది. క్రైమ్ వార్తలొస్తే భారీగా కవిత్వం నూరేవాళ్లు.
ఆమె ఒక మహిళ, ఈమే మహిళ. ఒక స్త్రీ ఇంకో స్త్రీని బాధించడం ఎన్నాళ్లు? అత్త ఆగడాలకి కోడలు బలయ్యే కాలం ఇంకానా? అని బాక్స్ కట్టి వదిలాం. తెల్లారేసరికి విషయం ఏమంటే అసలు ఆ సంఘటనే జరగలేదు. విలేకరి ఊరు వదిలి తిరుపతి ఆంధ్రజ్యోతి ఆఫీస్‌లో ఆశ్రయం పొందాడు. మామూలుగా విలేకరులు వార్తలు షేర్ చేసుకోవడం అలవాటు. మా రిపోర్టర్ ఇంకో పత్రిక రిపోర్టర్ని వార్తలు అడిగాడు (స్టేషన్‌కి వెళ్లే ఓపిక లేక). అతను ఈ ఫేక్ వార్తని ఊరు పేర్లతో సహా చెప్పేశాడు. ఒక దెబ్బకి రెండు పిట్టలన్నట్టు సాటి విలేకరి మీద , గ్రామంలోని ఆ కుటుంబంతోనూ అతనికి పాత కక్షలున్నాయి. సెటిల్ చేసుకున్నాడు.
ఈ వార్త ఆ ఊరంతా పాకి ఈ సారి అత్త ఆత్మహత్యకి ప్రయత్నించింది. రెండు లారీల్లో ఊరి జనం ఆంధ్రజ్యోతి మీద దాడికి బయల్దేరారు. ఈ లోగా అప్పటి ఎమ్మెల్యే గల్లా అరుణకుమారికి విషయం తెలిసి జనాన్ని శాంతింపజేసి, విలేకరితో క్షమాపణ చెప్పించి కథ సుఖాంతం చేశారు.
డెస్క్‌లో కూడా ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. ఒకసారి గజదొంగ అరెస్ట్ వార్త వస్తే దొంగ ఫొటోకి బదులు ఒక సర్పంచ్ ఫొటో వేశాం. మరుసటి రోజు ఆ ఊరి నుంచి ఫోన్.
“ఇంత కాలానికి మీరు నిజమైన వార్త వేశారు. మా సర్పంచ్‌ని మేము గజదొంగ అనే పిలుచుకుంటాం”- ఒక ఆకాశ రామన్న చెప్పి ఫోన్ పెట్టేశాడు.
టీవీ మీడియా వచ్చిన తర్వాత జరిగిన దారుణాలు అన్నీఇన్నీ కావు. వ్యక్తిగత జీవితాల్ని రోడ్డున వేశారు.
ఒక మహిళా అధికారి భర్తతో విడిపోయి ఇంకొకరితో కలిసి జీవిస్తే, దీంట్లో మీడియాకి ఏం సంబంధం? భర్తతో కుమ్మక్కై ఆమె పర్సనల్ లైఫ్‌ని షూట్ చేసే అధికారం వాళ్లకెవరిచ్చారు?
అబద్ధాలు చెప్పడం, నిజాల్ని దాచేయడం ఇప్పుడు మీడియాముందున్న అతిపెద్ద అంతిమ లక్ష్యం.
జీఆర్ మహర్షి