నారా లోకేశ్ పాదయాత్ర లక్ష్యం మరిచినట్టు కనిపిస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఎక్కువ గంటలు, ఎక్కువ కిలోమీటర్లు నడవడమే లోకేశ్ ప్రధాన ఎజెండాగా టీడీపీ నేతలు చెబుతున్నారు. పైగా టీడీపీని మోసే ఎల్లో మీడియా సైతం ఎక్కువ దూరం నడవడమే గొప్ప అంటూ లోకేశ్‌ను పొగుడుతూ నాశనం చేస్తోంది.
ప్రజలతో మమేకమై, టీడీపీకి రాజకీయంగా సానుకూలత తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర మొదలైంది. నాలుగు వేల కిలోమీటర్లు నడవాలని ఆయన పక్కా ప్రణాళికతో మొదటి అడుగు పడింది. ఇప్పటికి సగానికి పైగా కిలోమీటర్లు నడిచారు. ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ పాదయాత్ర సాగిందని, ఇదో రికార్డుగా టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా లోకేశ్‌ను ఆకాశమే హద్దుగా ప్రశంసిస్తున్నారు.
సాయంత్రం పాదయాత్ర విరామం ఇచ్చే సమయానికి మొదలు పెట్టడం, ప్రజలు విశ్రమించే వేళ నడవడం లోకేశ్ పాదయాత్రకే చెల్లింది. పైగా అర్ధరాత్రి వరకూ లోకేశ్ కోసం మహిళలు, చిన్న పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారని బిల్డప్‌లు. లోకేశ్ పాదయాత్ర గురించి వినడానికి కొంచెమైనా ఇంపుగా ఉన్న విషయాలను చెబితే సరే! లోకేశ్ పాదయాత్ర కోసం జనం అంతగా ఎదురు చూసే పరిస్థితి ఉందా? కనీసం సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి మరిచిపోతే ఎలా?
కిలోమీటర్లు, గంటల ప్రాతిపదికన పాదయాత్ర చేయడమే లోకేశ్ లక్ష్యమైతే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత మంది జనంతో మాట్లాడుతున్నాం? వారి మనసులకు ఏ మేరకు దగ్గరవుతున్నామనేదే ప్రధానం. ఈ లక్ష్యాలు నెరవేరనప్పుడు వేల కిలోమీటర్లు నడిస్తే ప్రయోజనం ఏంటి? కేవలం కాళ్ల నొప్పులు తప్ప, లోకేశ్‌కు, టీడీపీకి ఒరిగేదేమీ వుండదు. పాదయాత్ర అంటే ఈవెనింగ్, మార్నింగ్ వాక్ కాదు. ప్రజల్ని టీడీపీ వైపు నడిపించడం. అది ఎంత వరకూ వర్కౌట్ అవుతున్నదో ఆత్మ పరిశీలన చేసుకుంటూ, లోకేశ్ అడుగులను సవరించుకోవాల్సిన అవసరం వుంది.