మురళీమోహన్ ఇప్పుడు మాజీ ఎంపీ. గడచిన అయిదేళ్లపాటు ఆయన ఎంపీగా వున్నారు. ఫుల్ బిజీగా వున్నారు. అప్పుడు ఆయనకు తీరుబాటు లేదు. గుర్తురాలేదు. ఇప్పుడు మాజీ అయ్యారు. అందుకే గుర్తు వచ్చినట్లుంది. నంది అవార్డులు గత నాలుగేళ్లుగా ఇవ్వడం లేదని, అర్జెంట్ గా ప్రభుత్వం వాటిని ఇవ్వాలని అడిగారు. నిన్నటికి నిన్న ఆయన పాపం ఈ కోరిక కోరాల్సి వచ్చింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు వచ్చినపుడు ఈ కోరిక కోరారు.
గడచిన నాలుగేళ్లలో నంది అవార్డులు లేవు. నిజమే కానీ గడచిన అయిదేళ్ల పాటు పాలించింది ఆయన తెలుగుదేశం పార్టీనే. అలాగే ఇండస్ట్రీ నుంచి ఎంపీగా వున్నది కూడా ఆయనే. మరి పొరపాటున కూడా నంది అవార్డుల గురించి చంద్రబాబుకో? చినబాబుకో గుర్తుచేసిన దాఖలా అయితే లేదు. తాము చేయలేదు కానీ జగన్ అర్జెంట్ గా చేయాలని కోరిక.
పోనీ అలా అని జగన్ ను గౌరవించే, మంచి చేసుకుని ఇండస్ట్రీకి మంచి జరిగేలా ఏమన్నా ప్రయత్నించారా అంటే అదీ లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇండస్ట్రీ పెద్ద తలకాయలు ఏవీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్లి అభినందించింది లేదు. ఈ విషయం అనేకసార్లు నటుడు పృధ్వీరాజ్ చెప్పారు కూడా. అయినా ఎవరికీ పట్టింది లేదు.
మరి ప్రజల నుంచి అఖండ విజయం అందుకున్న ముఖ్యమంత్రిని అభినందించలేని ఇండస్ట్రీ ఏ విధంగా కోరికలు కోరగలదో?