చినబాబు లోకేష్ ఇప్పుడు పార్టీ సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. తొలిసారిగా.. పార్టీ సంరక్షణ బాధ్యతలను భుజాన వేసుకుంటూ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ నర్సీపట్నం వెళ్లి పార్టీ సమావేశం నిర్వహించాలనేది షెడ్యూలు. చినబాబు విశాఖ ఎయిర్ పోర్టులో దిగాడో లేదో.. ఈలోగా అక్కడ వికెట్ పడింది. నర్సీపట్నంలోని కీలక తెలుగుదేశం నాయకుల్లో ఒకరు.. మాజీమంత్రి అయ్యన్న పాత్రుడికి తమ్ముడు అయిన సన్యాసి పాత్రుడు.. పార్టీకి రాజీనామా చేసేశారు.
తెలుగుదేశం పార్టీ మీద కేడర్ లో నెమ్మది నెమ్మదిగా నమ్మకం సడలిపోతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు పార్టీ మారడానికి అనర్హత వేటు గురించి భయపడుతూ ఉన్నారే తప్ప… ఓడిపోయిన వాళ్లు, సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరికి వారు తమదారి తాము చూసుకునే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖకు చెందిన అడారి దంపతులు కూడా తెలుగుదేశానికి రాజీనామా చేసేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో నారాలోకేష్ తన యాత్రలు ప్రారంభించారు. నర్సీపట్నం వెళ్లడానికి బుధవారం నిర్ణయించారు. విశాఖ ప్రాంతంలో పార్టీలో లుకలుకలు ఉన్న నేపథ్యంలో.. లోకేష్ పర్యటన ఎజెండా ఏమై ఉంటుందా? అనే మీమాంస చాలామందిలో నడిచింది. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే పార్టీని పట్టించుకోకుండా.. తనదారి వేరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడికి మరింతగా ప్రాధాన్యం ఇచ్చేలా లోకేష్ పర్యటన ఉంటుందా? లేదా ఇతరత్రా వ్యూహాలు ఏమైనా అమలు చేస్తారా అని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో నర్సీపట్నంలో కీలక నాయకుడు సన్యాసిపాత్రుడు రాజీనామా చేసేయడం పార్టీకి పెద్దదెబ్బే. కాగా, సన్యాసిపాత్రుడు భవిష్యత్ కార్యచరణ ఏమిటనేది ఇంకా తేలలేదు. ఆయన వైకాపా వైపు వెళ్తారా? లేదా, భాజపాలోకి వెళ్తారా తెలియదు. తెలుగుదేశానికి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతున్నదని అర్థమవుతోంది.