రాయలసీమ జిల్లాల్లో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపించాయి. మొదట్లో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు రెండు వేల లోపు ఉన్న సమయంలో.. కర్నూలు, చిత్తూరు జిల్లాలో.. రెండు వందల లోపు స్థాయిలో కేసులు కనిపించాయి. లాక్ డౌన్ మినహాయింపుల సమయానికి ఆ జిల్లాలు రెడ్ జోన్లుగా నిలిచాయి. అయితే లాక్ డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి మారిపోయింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల మాట అటుంచితే.. అనంతపురం జిల్లాలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1600 వరకూ ఉంది. అయితే ఇదే సమయంలో డిశ్చార్జిల సంఖ్య కూడా మెరుగ్గా ఉండటం గమనార్హం.
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకూ 900 మందిని పైనే డిశ్చార్జ్ చేసినట్టుగా సమాచారం. వారు సంపూర్ణంగా కోలుకున్నారని ధ్రువీకరిస్తూ వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 600 కన్నా ఎక్కువగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య ఎక్కువగానే కనిపించినా, యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరట. అయితే కేసుల సంఖ్య రోజూ వందకు పైగానే పెరుగుతోంది. డిశ్చార్జిలు రెండంకెల సంఖ్యలో ఉంటున్నాయి. డెబ్బై ఎనభై మందిని డిశ్చార్జి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. స్థూలంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ ను నియమాలను పెంచుతూ ఉన్నారు. అనంతపురం టౌన్లో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తూ ఉన్నారు.
ఇక చిత్తూరు జిల్లాలో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అక్కడ కూడా కోలుకున్న వారి డిశ్చార్జిల సంఖ్య గణనీయంగా ఉంది. కానీ రోజువారీగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో.. లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న టౌన్లలో లాక్ డౌన్ ను పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఈ చర్యలతో అయినా సీమ జిల్లాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు వస్తుందని ఆశించాలి.
కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య రెండు వేలు దాటి పోయింది. ఏకంగా 68 మంది అక్కడ కరోనాతో మరణించారు. తబ్లిగీ లింక్ తో మొదట్లోనే కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువైంది. మినహాయింపుల తర్వాత మరింతగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.