అల్లూరి సీతారామరాజు. నిజమైన దేశభక్తుడు. భరత మాత దాస్య శ్రుంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే శరణ్యమని సుభాష్ చంద్రబోస్ కంటే ముందే ఆయుధం పట్టిన మేటి మొనగాడు. మన్నెం ప్రజల కోసం బాణం పట్టిన వీరుడు.
అల్లూరి పోరాటం అంతా విశాఖ గిరిసీమల్లోనే సాగింది. నాడు అమాయక గిరిజనులను నానా బాధలూ పెడుతున్న తెల్ల దొరలను తరిమికొట్టిన సామిగా అల్లూరిని వారు ఆరాధించారు. ఆయన బాటను అనుసరించారు.
రెండేళ్ళ పాటు గిరిజనులతో కలసి అల్లూరి చేసిన పోరాటానికి బ్రిటిష్ అధికారగణం గడగడవణికింది. అటువంటి అల్లూరి జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈనాటిది కాదు, కానీ సాకారం అయ్యేది మాత్రం వైసీపీ సర్కార్ హయాంలోనేనంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.
విశాఖను మూడు జిల్లాలుగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ విధంగా కొత్తగా ఏర్పాటు అయ్యే అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టి ఆయన పేరును చరిత్రలో నిలుపుతామని మంత్రి చెబుతున్నారు.
ఇక అల్లూరి పుట్టింది విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంకి గ్రామం. దానిని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తామని కూడా పర్యాటక మంత్రిగా అవంతి హామీ ఇచ్చారు. మొత్తానికి అల్లూరికి అసలైన నివాళి అర్పించే దిశగా వైసీపీ కార్యాచరణను సిధ్ధం చేయడం హర్షణీయం.