తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు యూటర్న్ స్పెషలిస్టుగా పేరు పొందిన సంగతిని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఒకసారని కాదు, ఒక అంశమని కాదు..తన అవసరానికి చంద్రబాబు నాయుడు దక్కినట్టుగా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు! ఈ క్రమంలో ఆయన 'పార్లమెంట్ మట్టి' గురించి కొత్త థియరీని చెప్పుకొచ్చారు.
అమరావతే రాజధానిగా ఉండాలనే ఆందోళనలు రెండు వందలవ రోజుకు చేరుకున్నాయట! అవెక్కడ జరుగుతున్నాయంటే, ఎవరింట్లో వాళ్లు చేస్తున్నారట.. ఆ వేడుకకు చంద్రబాబు నాయుడు ద్విశతదినోత్సవాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మోడీని పొగిడేశారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ బడితే అక్కడ మోడీని పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ ఇచ్చిన పార్లమెంట్ మట్టి గురించి కొత్త థియరీ చెప్పుకొచ్చారు.
అత్యంత పవిత్రమైన పార్లమెంటు మట్టిని మోడీ అమరావతి కోసం తెచ్చారని చంద్రబాబు నాయుడు తాజాగా చెప్పుకొచ్చారు. దానికో పరామర్థం కూడా ఉందట. అదేమిటంటే.. ఆ మట్టి ఇవ్వడం అంటే పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉన్నట్టట!
కట్ చేస్తే.. చంద్రబాబు నాయుడు అదే పార్లమెంట్ మట్టి, యమునా వాటర్ గురించి ఢిల్లీ వేదికగా తన సూపర్ ఇంగ్లిష్ లో ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగంగా.. చంద్రబాబు నాయుడు తనదైన ఇంగ్లిష్ లో ' యూ ఆర్ గివింగ్ పార్లమెంట్ మట్టి, యమునా వాటర్..' అంటూ వీరావేశంతో అన్నారు. పార్లమెంట్ మట్టిని, యమునా నీటిని ఏపీ మొహనా కొట్టారు.. అనేది చంద్రబాబు అప్పటి ఉద్దేశం. మోడీ తప్పుడు మనిషి అని, మన్మోహన్ కరెక్టు మనిషని కూడా ప్రసంగాన్ని కొనసాగించారు. అప్పుడేమో.. పార్లమెంట్ మట్టి, యమునా వాటర్.. పరమ చీప్ గా కనిపించాయి. అవి పనికిరానివి అనిపించాయి. ఇప్పుడేమో మోడీ అతి పవిత్రమైన వాటిని ఇచ్చారని చంద్రబాబు నాయుడు అంటున్నారు.
అయినా రెండు నాలుకల మాటలు, ప్లేట్లు ఫిరాయించాడాలు.. చంద్రబాబుకు కొత్త అయితే కదా, అయితే నెటిజన్లు మాత్రం ఊరికే ఉండటం లేదు, గతంలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని, తాజా మాటలను కలిపి వినిపిస్తూ ఆయన మార్కు అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉన్నారు!