టీ20 క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరనే అభిప్రాయానికి అనుగుణంగా జరుగుతూ ఉంది ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆ ఫార్మాట్ ప్రపంచకప్. మొదట్లో వరుణుడు వల్ల ఫలితాలు ఎటూ తేలకుండా.. అనాసక్తితో మొదలైంది ఈ ప్రపంచకప్. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ యమరంజుగా జరగడంతో ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కూడా ఫలితాలను వరుణుడు ఎంతో కొంత ప్రభావితం చేసినా.. సూపర్ 12లో ఆఖరి లీగ్ మ్యాచ్ ల ఫలితాలు ఆసక్తిదాయకంగా మారాయి.
ప్రత్యేకించి ఇండియాతో ఓటమి, ఆ పై పాకిస్తాన్ తో కూడా ఓడటంతో.. ఇంటి ముఖం పట్టిందనుకున్న పాకిస్తాన్ అనూహ్య మలుపుల మధ్యన సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకోవడం విశేషం. అలాగే టోర్నీ ఆరంభంలో వర్షం వల్ల తాము ఒక పాయింట్ ను కోల్పోయిన తర్వాత.. కసిగా ఆడుతూ నెగ్గుతూ వచ్చిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా పాకిస్తాన్ తో ఓటమి పాలవ్వడంతో కొంత డ్రామా మొదలైంది. అయితే నెదర్లాండ్స్ తో గెలిచి సౌతాఫ్రికా లాంఛనంగా సెమిస్ కు ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా డచ్ జట్టు ప్రొటిస్ ను చిత్తు చేసింది!
ఈ గెలుపుతో హాలెండ్ జట్లు తను సెమిస్ కు చేరకపోయినా.. సౌతాఫ్రికా అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. హాలెండ్ తో ఓటమితో సౌతాఫ్రికా సూపర్ 12 దశ నుంచినే నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు గ్రూప్ బీ నుంచి సెమిస్ కు చేరే పరిస్థితి ఏర్పడింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని పాక్ వాడుకుంది.
బంగ్లాదేశ్ పై నెగ్గి రెండో స్థానంలో గ్రూప్ బీ నుంచి సెమిస్ లో బెర్త్ ను ఖరారు చేసుకుంది పాక్ జట్టు. ఇండియా, జింబాబ్వేలతో వరస ఓటములతో ఇంటిదారి పట్లిందనుకున్న జట్టు ఇలా సెమిస్ కు లైన్ క్లియర్ చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వేల మ్యాచ్ వర్షంతో రద్దు కావడం, సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం.. ఈ రెండు మ్యాచ్ ల ఫలితం పాక్ ను సెమిస్ కు చేర్చింది.
ఇక జింబాబ్వేపై భారీ విజయంతో భారత జట్టు గ్రూప్ బీ నుంచి తొలి స్థానంలో సెమిస్ చేరింది. దీంతో.. సెమిస్ లో ఇండియా జట్టు ఇంగ్లండ్ తో తలపడనుంది. గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ టీమ్ తో పాకిస్తాన్ మరో సెమీ ఫైనల్ ఆడనుంది.