అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక లెక్క తేలింది. అయితే మధ్యాహ్నానికే ఫలితం వస్తుందని భావించి నప్పటికీ, సాయంత్రం వరకూ ఉత్కంఠ కొనసాగింది. మునుగోడు పోరులో చివరికి టీఆర్ఎస్నే విజయం వరించింది. మునుగోడు ఉప ఎన్నిక పోరులో టీఆర్ఎస్ 10 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించింది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరుతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలో చేరారు. తాజా ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తామే ప్రధాన ప్రత్యర్థి అని బీజేపీ ప్రజాతీర్పు ద్వారా గట్టిగా చెప్పింది. ఈ ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ), పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్) ప్రధాన పార్టీల తరపున ఢీకొన్నారు.
ఈ ఉప ఎన్నికలో మద్యం, డబ్బు ఏరులై పారింది. విజయమే లక్ష్యంగా నైతిక విలువలకు అన్ని పార్టీలు తిలోదకాలు ఇచ్చా యనే విమర్శలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉప ఎన్నిక ప్రభావం చూపుతుందన్న భారీ ప్రచారంతో ముఖ్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. అంతేకాకుండా …దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల నుంచి టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకున్నట్టు… మునుగోడులో ఆ పార్టీ విజయం సూచిస్తోంది.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10వేల పైగా మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలే ఆ పార్టీ కొంప ముంచాయని చెబుతున్నారు. అలాగే టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు విజయానికి దోహదం చేసిందని బీజేపీ అంటోంది. మొత్తానికి మునుగోడులో కేసీఆర్ పరువు కాపాడుకున్నారు.