మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠకు దాదాపు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే టీఆర్ఎస్‌ను విజయం వరించనుంది. 13వ రౌండ్ పూర్తయ్యే సరికి దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక అధికారికంగా ఓటమి ఖరారు కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో మీడియాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
మునుగోడులో తనను ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు, అధికారులు మోహరించారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలమైన వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో తనదే నైతిక విజయ మన్నారు. ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ 100 మంది ఎమ్మెల్యేలను మోహరించినప్పుడే తాను విజయం సాధించి నట్టైందన్నారు. భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఉప ఎన్నికగా కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం గెలిచామని చెప్పుకోడానికి మాత్రమే ఈ విజయం టీఆర్ఎస్‌కు పనికొస్తుందన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు. అందుకే ఉప ఎన్నికలో 80 నుంచి 90 వేల ఓట్లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అధర్మ యుద్ధం చేసిందన్నారు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో రానున్న ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మోదీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన పోరాటంలో ఇది మొదటి మెట్టు అని ఆయన అన్నారు.
ఫామ్‌హౌస్‌లో నిద్రపోతున్న కేసీఆర్‌ను మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చానన్నారు. ప్రజల తరపున పోరాడాల్సిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలను గాలికొదిలేసి టీఆర్ఎస్ అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయారని ఘాటు విమర్శ చేశారు. కమ్యూనిస్టులకు 10 నుంచి 15 వేల ఓట్లు వుండడం టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందని ఆయన అన్నారు.