తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి! దుబ్బాక, హుజూర్ నగర్ బై పోల్స్, జీహెచ్ఎంసీ పోల్స్.. అంటూ ఇన్నాళ్లూ ఇవన్నీ రేపు తెలంగాణలో అధికారం సంపాదించుకునేందుకు ఆధారాలుగా చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ, ఇదే ఊపును కొనసాగించుకోవాలన్న అత్యుత్సాహంతో తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికలో ఎదురుదెబ్బను పొందింది.
మునుగోడు ఉప ఎన్నికకు నిస్సందేహంగా కారణం భారతీయ జనతా పార్టీ. తమ చేతికి అంది వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికను తెప్పించి, గెలిచి కేసీఆర్ కు షాక్ ను ఇవ్వాలని కమలం పార్టీ భావించింది. ఒకవేళ ఈ అత్యుత్సాహం రాజగోపాల్ రెడ్డిదే అయినప్పటికీ.. తేడా వస్తే పరువు పోతుందని కమలం పార్టీ వారించాల్సింది. అయితే కమలం పార్టీ అలా వారించే పరిస్థితుల్లో అయితే లేదు!
ఉప ఎన్నికల్లో వరసగా గెలుస్తూ ఉంటే.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందనేందుకు రుజువు అవుతుందని లెక్కలేశారు. అయితే.. అవే లెక్కలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్లి కమలం పార్టీ తరఫున పోటీ చేసి, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఓడిపోయారనే.. అపఖ్యాతి దక్కుతోంది!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బిగ్ షాట్ వెళ్లి బీజేపీ తరఫున పోటీ చేసి, కోట్లు కుమ్మరిస్తేనే..బీజేపీ తరఫున నెగ్గలేకపోయారు! ఇక బీజేపీ వైపు వేగంగా అడుగులు వేసేవాళ్లు ఎవరైనా ఆలోచించుకోవాల్సిందే.. అనే పరిస్థితిని స్వయంగా కమలనాథులే తీసుకు వచ్చారు! ఉప ఎన్నికల విజయాలు, జీహెచ్ఎంసీ పోల్స్.. బండి సంజయ్ పాదయాత్ర.. ఇలా అన్నీ మంచి శకునములే అనుకున్న బీజేపీకి మునుగోడు రూపంలో పెద్ద సెట్ బ్యాక్ ఎదురైంది!
మరి కింకర్తవ్యం? అంటే.. ఇప్పుడు కమలనాథులు డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నారు! నైతికంగా వారిదే విజయమట! కేసీఆర్ అక్రమాలకు పాల్పడి విజయం పొందారట! ఓడిపోయాకా.. ఇలాంటి మాటలెన్నైనా చెప్పొచ్చు!