రాజకీయాల్లో రక్తసంబంధీకులే శత్రువులుగా మారి తలపడిన సందర్భాలు బోలెడు ఉండవచ్చు. అన్నదమ్ములూ, అక్క చెల్లెళ్లు, దాయాదులు.. ఇలా బంధుత్వాలతో సంబంధాలు లేకుండా రాజకీయంగా తలపడిన వారు చాలా మందే ఉన్నారు. మరి ఇలాంటి జాబితాలో ఈ పేర్లు కూడా ఎక్కుతాయని కొన్నేళ్ల కిందట ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు!
దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంతానం మధ్యన రాజకీయ విబేధాలు రచ్చకు ఎక్కకపోయినా… వైఎస్ తనయుడు జగన్ కు పూర్తి వ్యతిరేక రాజకీయ శిబిరానికి చేరువవుతున్నట్టుగా కనిపిస్తున్నారు వైఎస్ తనయ షర్మిల. గత కొన్ని రోజుల రాజకీయ పరిణామాలు.. ఈ అభిప్రాయాలకు కారణం అవుతూ ఉన్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల స్టేట్ మెంట్ ఇచ్చిందనే వార్తలు, అంతకు ముందు వైఎస్ వివేక హత్య పై ఆమె చేసిన వ్యాఖ్యలు… ఇవన్నీ షర్మిల జగన్ శిబిరానికి వ్యతిరేకంగా వేస్తున్న అడుగులనేందుకు తార్కాణాలవుతున్నాయి.
సోదరుడితో వైఎస్ షర్మిల డైరెక్టుగా రాజకీయంగా తలపడకపోయినా.. ఇప్పుడు జగన్ ప్రత్యర్థులకు షర్మిల ఆయుధం అవుతున్నారు. ఆమె వేస్తున్న రాజకీయ అడుగుల వల్ల ఆమె ఏం సాధిస్తారనేది పక్కన పెడితే, జగన్ వ్యతిరేకులకు మాత్రం షర్మిల అందివచ్చిన ఆయుధం అవుతున్నారు. మరి ఇలాంటి ఆయుధాలను ఎంత వరకూ వాడుకోవాలో.. ఆ తర్వాత వీటిని ఎలా పక్కన పెట్టేయాలో.. ఆ వర్గానికి బాగా తెలుసు కూడా!
షర్మిలకు తెలంగాణలో మీడియాలో కవరేజ్ కు ఒక వర్గం మీడియా గట్టి హామీ ఇచ్చిందని, ఆ సపోర్ట్ కోసం ఆమె వారి రాజకీయ ఆటలో పావు అవుతోందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. మరి మీడియా సపోర్ట్ ఉంటే చాలు రాజకీయంగా ఉనికిని చాటుకోవచ్చు అని వైఎస్ తనయ ఆలోచిస్తోందంటే.. కాస్త ఆశ్చర్యం కలగకమానదు! మరి జగన్ కు వ్యతిరేకంగా షర్మిల అడుగులు ఇంతటితో ఆగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కుటుంబ పరమైన విబేధాలు.. రాజకీయంతో మమేకం అయ్యి.. ఇంకా ఎంత వరకూ వెళతాయో!
ఇప్పటికే తెలంగాణ రాజకీయంలోకి వచ్చి.. ఎలాంటి ఆదరణను పొందలేక ..మొదట్లో ఉన్న ఊపు కూడా కోల్పోయిన షర్మిల .. ఈ బేల పరిస్థితుల్లో జగన్ వ్యతిరేకుల రాజకీయ వ్యూహాల్లో ఇంకా ఎలా కూరుకుపోతారో..! అనే సానుభూతి కూడా ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉంది.