మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే…. ఈ ఊహే పెద్ద రాజకీయ రణరంగానికి నాంది! మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిన కమలం పార్టీ అక్కడ గనుక తమ అభ్యర్థిని గెలిపించుకుని ఉంటే.. ఈ పాటికి తెలంగాణ రాజకీయంలో కలకలం రేగేది. టీఆర్ఎస్ ప్రభుత్వ పతానం కూడా దాదాపు ప్రారంభం అయ్యేదేమో!
మునుగోడు ఉప ఎన్నికకు ముందే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని బీజేపీ పెద్ద రాజకీయ డ్రామాకే తెర లేపే ప్రయత్నం జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. మరి మునుగోడులో కమలం గెలిచి ఉంటే? అదిగో ఎమ్మెల్యేలు.. ఇదిగో శిబిరం! అన్నట్టుగా మారేది రాజకీయం!
ఈ పాటికి టీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని.. వారిని శిబిరానికి తరలిస్తామంటూ కొంతమంది బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేసేవారేమో! తెలంగాణ ప్రజానీకం విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారని, ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తమతో చేతులు కలుపుతున్నారని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ కుటుంబ వైఖరి నచ్చలేదని.. దీంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆ ఎమ్మెల్యేలను తాము కలుపుకుపోవడానికి రెడీ అవుతున్నట్టుగా బీజేపీ నేతల ప్రసంగాలు దుమ్ము లేచేవి!
కట్ చేస్తే.. మునుగోడు ఉప ఎన్నికను ఏ ఉద్దేశంతో కమలం పార్టీ వాళ్లు తెచ్చారో కానీ, ఆ ఫలితం అయితే దక్కలేదు! మునుగోడులో వారి అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో.. బీజేపీ కిక్కురుమనలేని పరిస్థితుల్లో ఉంది. తమ ఊపు కొనసాగుతోందని చెప్పుకోవడానికి కానీ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తున్నారని, టీఆర్ఎస్ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేసింది ఈ ఉప ఎన్నిక ఫలితం!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉందనంగా తెరపైకి వచ్చిన ఈ ఉప ఎన్నిక ఫలితంపెద్ద పొలిటికల్ డ్రామాను అయితే తప్పించింది! ఇక ఎన్నికల వరకూ ఉత్తుత్తి సవాళ్లు, రచ్చలే ఉండవచ్చు!