ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెగ్గి ఉంటే.. వెంకట్ రెడ్డి కూడా మరో ఆలోచన లేకుండా బీజేపీలోకి పయనం అయ్యే వారు! ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్లు షోకాజ్ నోటీసు మీద నోటీసు జారీ చేసి ఉన్నారు! వాటిని ధిక్కరించే వారు. ఆ పై కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించేది! సింపుల్ గా బీజేపీ కార్యకలాపాల్లో వెంకట్ రెడ్డి బిజీ అయిపోయేవారు కాబోలు!
అయితే వ్రతం చెడింది.. ఫలం కూడా దక్కలేదు! కాంగ్రెస్ అయితే ఓడిపోయింది కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం గెలవలేదు. ఇది వెంకట్ రెడ్డికి కూడా ఇబ్బందికరమైన పరిణామమే! అటు కాంగ్రెస్ వద్ద పరువు పోయింది, ఇటు బీజేపీ తరఫున నెగ్గుకురాలేకపోయారు!
ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో ఏ స్థితిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా.. ఎవరినైనా విమర్శింంచే స్థాయిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండేవారు. జానారెడ్డిని అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయినా, రేవంత్ ను అయినా.. ఎంత తక్కువగా అయినా మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయానికి ఆ విలువ ఉండేది!
పార్టీ తరఫున నెగ్గలేని వారికి పీసీసీ పదవులు ఇస్తున్నారని ఆయన వాపోతే.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే కదా అనుకున్నారు! జానా కన్నా, ఉత్తమ్ కన్నా, రేవంత్ కన్నా తను సమర్థుడిని అని వెంకట్ రెడ్డి చెప్పుకుంటే.. ఒక అవకాశం ఇచ్చి చూడాల్సిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి! అయితే.. మునుగోడు ఉప ఎన్నికతో రాజగోపాల్ రెడ్డి పరువే కాదు, వెంకట్ రెడ్డి పరువు కూడా పోయింది.
కోరి ఉప ఎన్నికను తెచ్చి పార్టీ పరువు ను తీసి, ఊపు ను తగ్గించి వేసి రాజగోపాల్ రెడ్డిని రేపటి నుంచి బీజేపీ అధిష్టానం ఎలా చూస్తుందో, టీబీజేపీలో ఆయన విలువ ఏమిటో ఊహించలేనంత కష్టమైనది కాదు! ఇక సోదరుడు వేరు, తన రాజకీయం వేరని మొదట్లో చెప్పి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించిన వెంకట్ రెడ్డికి కూడా కాంగ్రెస్ లో కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా విలువను ఇవ్వరు! ఇక షోకాజ్ లకు సమాధానం చెప్పుకుని క్షమాపణలు కోరడమే వెంకట్ రెడ్డి కి ఉన్న అవకాశం ఏమో!