సీన్ లోకి జగన్.. ముగిసిన విశాఖ సంక్షోభం

వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసింది. రెండు రోజుల్లోనే ఈ ఎపిసోడ్ కి శుభం కార్డ్ వేశారు సీఎం జగన్. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త స్థానానికి రాజీనామా చేసిన…

వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసింది. రెండు రోజుల్లోనే ఈ ఎపిసోడ్ కి శుభం కార్డ్ వేశారు సీఎం జగన్. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త స్థానానికి రాజీనామా చేసిన 2 రోజుల్లోనే దాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. 

సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత ఆయన నుంచి భరోసా లభించిందని అందుకే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు వాసుపల్లి. అంతే కాదు, ఇకపై రెట్టించిన విశ్వాసంతో, ఉత్సాహంతో పనిచేస్తానని కూడా అధిష్టానానికి భరోసా ఇచ్చారు.

తనను శంకించారని, శల్య పరీక్షలు చేశారంటూ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ రెండు రోజుల క్రితం వాసుపల్లి అధిష్టానానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అధిష్టానం ఆయనతో సంప్రదింపులకి ప్రయత్నించగా కొంతసేపు ఆయన ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేరు. దీంతో అధిష్టానం వాసుపల్లి వ్యతిరేక వర్గంగా ఉన్న సీతంరాజు సుధాకర్ ని పిలిపించుకుని మాట్లాడింది. 

తాడేపల్లిలో సుధాకర్ తో మాట్లాడారు వైవీ సుబ్బారెడ్డి. తన పరిధిలోనే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నానని సుధాకర్ వివరించారు. గొడవలు వద్దని, గ్రూపులు అసలే వద్దని సుధాకర్ కి చెప్పి పంపించారు సుబ్బారెడ్డి.

మరోవైపు వాసుపల్లితో సీఎం జగన్ నేరుగా ఫోన్ లో మాట్లాడటంతో ఈ సంక్షోభం ముగిసినట్టు తెలుస్తోంది. 2024 విశాఖ సీటు విషయంలోనో.. మరో విషయంలోనో ఆయనకు గట్టి హామీ లభించిందని, అందుకే ఆయన వెనక్కు తగ్గారని వైసీపీ వర్గాలంటున్నాయి. దీంతో ఆయన తన లేఖలో జగన్ కి ధన్యవాదాలు చెప్పారు. ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

ఒకరకంగా టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో జగన్ సానుకూలంగానే ఉన్నారని అర్థమవుతోంది. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా టికెట్ విషయంలో అధిష్టానం గట్టి హామీ ఇచ్చింది, వైరి వర్గాన్ని కంట్రోల్ లో పెట్టింది. ఇప్పుడు వాసుపల్లి విషయంలో కూడా అదే జరిగింది.

టీడీపీ ఆశలు గల్లంతే..

వైసీపీలో ముసలం పుడితే సంతోషించాలని చూస్తున్న టీడీపీ, వాసుపల్లి రాజీనామా వెనక్కి తీసుకోవడంతో షాకైంది. వాసుపల్లిని ఎలాగైనా పార్టీలోకి తీసుకుని, మిగతావారికి కూడా గేలం వేయాలని చూస్తోంది టీడీపీ. కానీ ఆ ఎత్తులు చిత్తయ్యాయి. 

ఎక్కడ ఏ నియోజకవర్గంలో చిన్నపాటి సంక్షోభం వచ్చినా దాన్ని ముదరకుండానే చికిత్స చేస్తున్నారు సీఎం జగన్.