తెలంగాణలో రాజకీయం చాలా చిత్రంగా మలుపులు తిరుగుతోంది. నవంబరు- డిసెంబరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారాస ఆల్రెడీ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసేసింది. నేడో రేపో నోటిఫికేషన్ కూడా రావొచ్చు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ఒకటిరెండు నెలలకంటె ఎక్కువ సమయంలేదు. ఈ దశలో కొత్తగా మంత్రి పదవిని తీసుకోవడం అంటే.. ఎంత అమాయకత్వమో కదా అని ఎవ్వరికైనా అనిపిస్తుంది. కానీ.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డం అందుకు సిద్ధం అంటున్నారు.
తనకు తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అలకపూనిన మహేందర్ రెడ్డిని పార్టీ వర్గాలు బుజ్జగించి.. తక్షణ ప్రయోజనంగా మంత్రిపదవి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈటల భారాసను వీడిపోయిన తర్వాత.. ఖాళీ అయిన కేబినెట్ పోస్టును, ఆపద్ధర్మంగా సీఆర్ ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు.
సీనియర్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి 2018 ఎన్నికల్లో భారాస తరఫున తాండూరు నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్కు చెందిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కేవలం 2800 ఓట్ల తేడాతో ఓడారు. తర్వాతి పరిణామాల్లో రోహిత్ రెడ్డి భారాసలోకి రావడంతో, పట్నం పరిస్థితి అయోమయం అయింది. ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా.. తనకు ఎమ్మెల్యే టికెట్ కావాల్సిందే అని పట్టుబట్టిన మహేందర్ రెడ్డి.. దక్కకపోతే తిరుగుబాటు ఎగరేయడానికి సిద్ధం అయ్యారు. నలుగురికి తప్ప అంతా సిటింగు ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించిన కేసీఆర్, పైలట్ రోహిత్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ చేయడంతో పట్నం పార్టీని వీడడం గ్యారంటీ అనే పుకార్లొచ్చాయి. ఇంతలోనే గులాబీ నాయకులు.. ఆయనను కలిసి బుజ్జగించడమూ ఆయనకోసం ప్రత్యేకంగా కేబినెట్లో ఖాళీ ఉన్న ఒక మంత్రిపదవిని కేటాయిస్తామని చెప్పడమూ ఒప్పించడమూ, గజమాలతోసత్కరించడమూ జరిగిపోయింది.
గవర్నరుకు ఖాళీ దొరకగానే.. ప్రమాణస్వీకారం పెట్టుకుంటారట. పట్నం ఇంకో మూడు నెలల్లో ఎన్నికలుండగా ఇప్పుడు మంత్రి అనిపించుకుంటున్నారు. ఇంత షార్ట్ టర్మ్ తాయిలం బహుశా మరెవ్వరికీ దక్కకపోవచ్చు. ఇలా ఇంత షార్ట్ టర్మ్ బిస్కట్ కే పట్నం ఎలా ఒప్పుకున్నారబ్బా అనే సందేహం పలువురిలో కలుగుతోంది. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మంత్రి పదవిని కంటిన్యూ చేస్తామని ఆయనకు ఆశచూపించి ఉండవచ్చు గానీ.. అప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే పట్నం ఏం చేస్తారు? ఇప్పుడు వారికి కూడా అవసరం గనుక.. ఆయనకోసం తలుపులు తెరచిన వారు.. అప్పటిదాకా తలుపులు తెరచి ఉంచుతారా? అనేది సందేహం.
మొత్తానికి టికెట్లు దక్కని అసంతృప్తుల్ని రకరకాల మార్గాల్లో బుజ్జగించడం అనేది భారాసలో పట్నంతోనే ప్రారంభం అయినట్టుంది.