ఉస్తాద్ కొత్త షెడ్యూల్.. మరో గ్లింప్స్ ఇస్తావా హరీష్?

వారాహి యాత్రకు సంబంధించి మరో విడత పూర్తిచేసిన పవన్ కల్యాణ్, ఏ సినిమాకు కాల్షీట్లు ఇస్తారనే చర్చకు తెరపడింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆయన కాల్షీట్లు కేటాయించాడు.…

వారాహి యాత్రకు సంబంధించి మరో విడత పూర్తిచేసిన పవన్ కల్యాణ్, ఏ సినిమాకు కాల్షీట్లు ఇస్తారనే చర్చకు తెరపడింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆయన కాల్షీట్లు కేటాయించాడు.

సెప్టెంబర్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటాడు పవన్. ఇది లెంగ్తీ షెడ్యూల్ అని మాత్రమే తెలిపిన మేకర్స్… ఎన్ని రోజులు అనే విషయాన్ని బయటపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం, 2 వారాల పాటు ఇది జరగనుంది.

ఈ షెడ్యూల్ కోసం ఆనంద్ సాయి భారీ సెట్ నిర్మించాడు. ఆ సెట్ లోనే ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ శ్రీలీలతో పాటు, కీలక నటీనటులు ఇందులో పాల్గొంటారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు హరీశ్ శంకర్. ఆ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలతోనే ఏకంగా గ్లింప్స్ కట్ చేసి రిలీజ్ చేశాడు. అప్పట్లో అదంతా ఓ ఫెస్టివల్ గా నడిచింది. ఇప్పుడు మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు.

దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి హరీశ్ శంకర్ పై దృష్టి సారించారు. ఈసారి కూడా మరో గ్లింప్స్ ప్లాన్ చేయమంటూ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. చెప్పుకోడానికి ఫన్నీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ డిమాండ్ లో న్యాయం ఉంది. ఒక షెడ్యూల్ కే గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు, ఈసారి భారీ షెడ్యూల్ అంటున్నారు. కాబట్టి ఏకంగా టీజరే రిలీజ్ చేయొచ్చనేది వాళ్ల వాదన.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది కూడా రీమేక్ సినిమానే అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ స్టయిల్, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రీమేక్ ప్రాజెక్టుకు కూడా భారీగా మార్పుచేర్పులు చేశారంట.