ఈరోజు బాగా వైరల్ అయిన స్టిల్ ఏదైనా ఉందంటే, అది పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ ఫొటో మాత్రమే. అది కూడా సోలో స్టిల్ కాదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి దిగిన ఫొటో. మరీ ముఖ్యంగా ఆ ఫొటోను రాఘవేంద్రరావు బయటపెట్టారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. పవన్ కల్యాణ్ నటవారసుడు తయారవుతున్నాడు. తనయుడు అకిరా నందన్ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. అదే యాక్టింగ్ స్కూల్ లో రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ కూడా చేరాడు. అలా ఇద్దరితో కలిసి ఫొటో దిగారు దర్శకేంద్రుడు. ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేశారు.
పవన్ కల్యాణ్ కొడుకు సినిమాల్లోకి రాబోతున్నాడనే విషయం ఈ ఒక్క ఫొటోతో తేలిపోయింది. అకిరా ఇప్పటికే పియానో నేర్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది. ఇప్పుడు ఏకంగా నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. అయితే 19 ఏళ్లకే అతడు ఫిలిం స్కూల్ లో చేరడం ఆశ్చర్యం.
అన్నట్టు ఈ ఫిలిం స్కూల్ ఇండియాలో కాదు, అమెరికాలో ఉంది. రాఘవేంద్రరావు మనవడు, అకిరా అందులోనే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రాఘవేంద్రరావు ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అకిరా త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడంటూ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.
అకిరా తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని గతంలోనే ప్రకటించింది ఆమె తల్లి రేణుదేశాయ్. తాజాగా ఆమె తన మాజీ భర్త పవన్ కల్యాణ్ కు బహిరంగంగా మద్దతిచ్చింది. అకిరా టాలీవుడ్ డెబ్యూ కోసమే రేణు ఇలా పవన్ కు సపోర్ట్ గా మాట్లాడి ఉంటుందంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ, ఫిలింస్కూల్ లో చేరాడు అకిరా.
బహుశా అందుకేనేమో, లేనిపోని వివాదాలు తలెత్తుతాయనే అనుమానంతో, పోస్టు పెట్టిన కొద్దిసేపటికే ఆ స్టిల్ ను, టోటల్ మేటర్ ను రాఘవేంద్రరావు డిలీట్ చేశారు.