పవర్ స్టార్. నిజానికి ఇప్పుడు ఆయన స్టార్ కాదు. సినిమాలకు ఆయనే క్లియర్ గా స్వస్తి చెప్పేసారు. కోట్ల ఆదాయం ఇచ్చే సినిమా రంగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. ఇంకా అప్పుడప్పుడు చెబుతున్నారు కూడా. అందువల్ల ఆయనను రాజకీయ నాయకుడిగానే ఇప్పుడు గుర్తించాలి. ఎందుకంటే సినిమాలు మానేసినా, ఇంక మరే వృత్తి, ప్రవృత్తి చేపట్టకుంటే సినిమా నటుడే ఎప్పటికీ. కానీ సినిమాలు మానేసి, రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆయన రాజకీయ నాయకుడే ప్రస్తుతం.
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, పవన్ పుట్టిన రోజును ఫ్యాన్స్ సంబరంగా జరుపుకోవచ్చు. ఎందుకంటే వాళ్లకు ఆయన అంటే ప్రాణం, అంత అభిమానం. అందువల్ల వాళ్లు హడావుడి చేయడంలో, హల్ చల్ చేయడంలో తప్పు లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ, దాని నాయకులు పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడం, మరో అడుగు ముందుకు వేసి, ఆయనవి ఉన్నత భావాలు అంటూ పొగడడం అంటే వాళ్ల అవసరం అని సరిపెట్టుకోవాల్సిందే.
కానీ మీడియాకు ఎందుకింత హడావుడి? చానెళ్లలో తరచు శుభాకాంక్షల షార్ట్ విడియో ప్రదర్శించడం? మీడియా సంస్థల్లో కేక్ లు కట్ చేయడం, చేయించడం, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చూస్తుంటే అంత ప్రీప్లాన్డ్ పబ్లిసిటీ వ్యవహారం మాదిరిగా కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం అనుకూల మీడియా హడావుడి చెప్పనక్కరేలేదు. వీళ్లందరికీ అర్జెంట్ గా పవన్ కళ్యాణ్ తెగ ముద్దు వచ్చేస్తున్నారు. కొన్ని మాధ్యమాలు అయితే పవన్ మాత్రమే భవిష్యత్ రాజకీయాల ఆశాదీపం అన్నట్లు కీర్తించింది. అంటే మరి లోకేష్ బాబును పక్కన పెట్టేసినట్లేనా?
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ లో పవన్ అండ లేకుండా ముందుకు వెళ్లలేదు, విజయం సాధించలేదు అన్న పాయింట్ పై క్లారిటీ దొరికేసినట్లే వుంది. భవిష్యత్ లో పవన్ అండ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వుండాలని, వుంటుందని, ఇప్పటి నుంచే డిసైడ్ అయిపోయి, ఆ విధంగా పావులు కదుపుతూ, ఆ మేరకు వార్తలు వండి వారుస్తున్నట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద ఎన్నికల్లో దారుణ పరాజయం పొంది, రెండు చోట్ల ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫుల్ గా డ్యామేజ్ అయింది. అదంతా రిపేర్ చేసి, మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చే అవకాశంగా ఈబర్త్ డే ను వాడుకున్నట్లు కనిపిస్తోంది. ఇంకెందుకు, పనిలో పనిగా తూచ్ అనేసి, ఒకటి రెండు సినిమాలు కూడా చేయించేస్తే, ఇమేజ్ మరింత పెరుగుతుంది. వచ్చే ఎన్నికలకు అది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు.
కానీ ఒకటే అనుమానం. ఇఫ్పుడు వున్న ఇమేజ్ కు పదింతలు వుంది 2019 ఎన్నికల టైమ్ లో. అయినా రెండు చోట్లా ఓడిపోయారు. అందువల్ల పవన్ ఇమేజ్ పెరిగినా, పెంచినా ఆయనకు లాభం వుండకపోవచ్చు. కానీ ఆయన బలం పెంచుకుని, తమతో కలిస్తే, తమకే లాభం అన్న ఆశ తెలుగుదేశం పార్టీది. అందుకే ఆ పార్టీ అనుకూల వర్గాల హడావుడి, తాపత్రయం ఇదంతా అనుకోవాలి.పైగా పవన్ కు కూడా జ్ఞానోదయం అయ్యే వుంటుంది. ఒంటరిగా పోటీ చేసి సాధించేది ఏదీ వుండదని.