జనం గుండెల్లో కొలువు తీరిన వైఎస్ రాజశేఖర రెడ్డి పవిత్ర స్మృతికి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నివాళులు అర్పించారు. నాన్న స్ఫూర్తే బాటగా మనల్ని ముందుకు నడిపిస్తుందని ఆయన ఆకాంక్షించారు. సోమవారం ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల తదితరులు నివాళలు అర్పించారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి పదవ వర్ధంతి.
ఇడుపుల పాయ నుంచి తిరిగి బయల్దేరిన తర్వాత.. జగన్.. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తన తండ్రి పదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ .. ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ‘‘పరిపాలన సంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలు అయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది. నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుంది.’’ అని జగన్.. తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా.. నివాళి అర్పించారు. ఈ మేరకు మమతా బెనర్జీ ట్విటర్ ఖాతాలో.. ఇంగ్లిషు మరియు బెంగాలీ భాషల్లో ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ ను కూడా ట్యాగ్ చేశారు.
ప్రజల సంక్షేమం తప్ప మరే అంశమూ తన ఎజెండా కాదని అడుగడుగునా నిరూపించుకున్న జననేత రాజశేఖర రెడ్డి.. 2009 సెప్టెంబరు 2న చిత్తూరుజిల్లాలో అధికారిక కార్యక్రమానికి హెలికాప్టర్ లో బయల్దేరి ప్రమాదానికి గురై మరణించారు. ఆ రకంగా … తన చివరి శ్వాస వరకు ప్రజలకోసమే జీవించిన నాయకుడి ఆయన కీర్తి గడించారు. భౌతికంగా మరణించినా కూడా.. ఆయనను ఎంతగానో అభిమానించే కోట్లాది మంది ప్రజల హృదయాలలో కొలువు తీరారు.