జనసేనాని పవన్‌కల్యాణ్ కొన్ని రోజులుగా కొత్త నినాదం అందుకున్నారు. జగన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన పదేపదే హెచ్చరిస్తున్నారు. కూల్చివేతతో పాలన మొదలు పెట్టిన ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ఆయన అంటున్నారు. వైసీపీ వాళ్లకు చెబుతున్నా…మా మట్టిని కూల్చారు, మీ కూల్చివేత తథ్యం అని తాజాగా ఆయన హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య వుంటుందని న్యూటన్ మహాశయుడు ఏనాడో చెప్పారు.
ఇది పవన్‌కల్యాణ్ హెచ్చరికలకు కూడా వర్తిస్తుంది. పవన్‌కల్యాణ్ హెచ్చరికలపై ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తమదైన రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా విడిచిపెట్టకపోవడం గమనార్హం. పవన్‌కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని వైసీపీ జనంలోకి బలంగా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో పవన్ పదేపదే వాడుతున్న కూల్చివేత అనే పవర్ ఫుల్ డైలాగ్‌ను తీసుకుని, ఆయనపై తిరిగి ప్రయోగించడం విశేషం.
“కూల్చడం అంటే… అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వదిలేసినంత సులువు కాదు. కూల్చడం అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో సహజీవనం చేయడం కాదు. కూల్చడం అంటే ప్యాకేజీ మాట్లాడుకునేంత ఈజీ కాదు…అది జగన్ ప్రభుత్వం. పోరాటానికి పర్యాయ పదమైన జగన్ నాయకత్వం వహిస్తున్న పార్టీ” అంటూ నెటిజన్లు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తమదైన సృజనాత్మక కోణంలో పవన్‌కు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నారు.
అమ్మాయిల జీవితాల్ని కూల్చేసి భరణం చెల్లించి చేతులు దులుపుకున్నావు. జగన్ జోలికి వస్తే భరతం పడతాడని జాగ్రత్త అంటూ వైసీపీ యాక్టివిస్టులు హెచ్చరిస్తూ పెడుతున్న పోస్టులు జనసేనను ఇరిటేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబును కూడా విడిచి పెట్టలేదు.
చంద్రబాబు దృష్టిలో.. కూల్చడం అంటే పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా సీఎం గద్దె నుంచి దించడం. కూల్చడం అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణలను వాడుకుని వదిలేయడం, కూల్చడం అంటే ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మంత్రి పదవులు కట్టబెట్టడం… ఎన్టీఆర్ స్వప్నాల్ని ఛిద్రం చేయడం…ఇలా దత్త తండ్రి, దత్త పుత్రుల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చని ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు.