జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయంగా ఓవరాక్షన్ పీక్కు చేరింది. అవాస్తవాలతో సానుభూతి పొందాలని తపిస్తున్నారు. ఇందుకు గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్‌కల్యాణ్ పర్యటనే నిదర్శనం. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే అక్కసుతో జనసేనకు చెందిన కొందరి ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూలగొట్టారని ఆయన ఆరోపణ, ఆవేదన. అదే నిజమైతే పవన్‌కల్యాణ్ ఆందోళన అర్థం చేసుకోదగ్గదే.
అయితే పవన్ ఆరోపణలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తేడా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటంలో పవన్‌కల్యాణ్ ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చిల్లర రాజకీయాలు చేయడంలో దత్త తండ్రికి దత్త పుత్రుడు ఏ మాత్రం తీసిపోరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలు, సినిమాలు వేర్వేరని ఆయన గ్రహించినట్టు లేదు.
రాజకీయ తెరపై కూడా తానే హీరో అనుకుంటూ, ప్రత్యర్థులకు ఆయన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. వైసీపీ వాళ్లకు చెబుతున్నా అంటూ హీరోలా హెచ్చరించడం ఆయనకే చెల్లింది. ప్రతిసారి తానెవరికీ భయపడేది లేదని చెప్పడం అసహనం కలిగిస్తోంది. ఎంత మంది ఎన్ని రెక్కీలు నిర్వహించినా భయపడేది లేదని ఆయన అన్నారు. అంతేకాదు, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదే అని హచ్చరించారు.
హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద రెక్కీ జరగలేదని ఇప్పటికే తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ రెక్కీని పట్టుకుని పవన్‌కల్యాణ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు వేలాడడం వెనుక రాజకీయ ప్రయోజనాలు తప్ప, మరే కారణం కనిపించడం లేదు. చివరికి తన ప్రాణాలకు ముప్పు ఉందనే తప్పుడు ప్రచారానికి కూడా పవన్ దిగజారారంటే…. ఆశ్చర్యం కలగకుండా వుండదు.
తద్వారా తన సామాజిక వర్గాన్నంతటిని జనసేన వైపు తిప్పుకుని, టీడీపీకి గంపగుత్తగా అమ్ముకోడానికే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ వైఖరి చూస్తుంటే రానున్న రోజుల్లో పాతాళం కూడా సిగ్గుపడేలా పతనమయ్యేలా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.