తమిళ సై.. కేసీఆర్ కు తలనొప్పిగా మారుతారా?

అసలు బీజేపీకి బేస్ మెంట్ లేని చోట.. ఆ పార్టీ తరఫున పలుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన ఘనత ఆమె సొంతం. ఒకసారి కాదు.. వరస పరాజయాలతో ఆమెతో తమిళనాడు రికార్డు పుటల్లోకి…

అసలు బీజేపీకి బేస్ మెంట్ లేని చోట.. ఆ పార్టీ తరఫున పలుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన ఘనత ఆమె సొంతం. ఒకసారి కాదు.. వరస పరాజయాలతో ఆమెతో తమిళనాడు రికార్డు పుటల్లోకి ఎక్కారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటి  వరకూ ఏ మాత్రం ఉనికి చాటలేకపోయిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. బీజేపీకి ఓటేయడం కాదు కదా.. బీజేపీ విధానాలనే తీవ్రంగా అసహ్యించుకుంటారు తమిళ ప్రజలు.  అక్కడి రాజకీయ పార్టీలు బీజేపీని కనీసం మొలక కూడా ఎత్తనీయకుండా చేస్తూ  ఉంటాయి.

అలాంటి చోట.. గత పదేళ్లలో బీజేపీ మరింత దారుణమైన అవస్థను అనుభవిస్తోంది. ఆఖరికి అన్నాడీఎంకే ను తమ బుట్టలోకి వేసుకున్నా బీజేపీ అక్కడ డిపాజిట్లు సంపాదించుకోలేకపోయిందంటే తమిళనాట ఆ పార్టీ పరిస్థితిని మరేం వివరించనక్కర్లేదు. అలాంటి రాష్ట్రంలో బీజేపీ విభాగానికి అధ్యక్షురాలుగా వ్యవహరించారు తమిళ సై సౌందర్యరాజన్. డిపాజిట్ తెచ్చుకోవడం గగనం అయినా ఆమె పోటీ చేస్తూ వచ్చారు. ఓడిపోతూనే వచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో ఆమె సేవలకు గానూ తెలంగాణ గవర్నర్ పోస్టును అప్పగించారు. అలా పార్టీ వీరవిధేయురాలికి అవకాశం లభించింది. పార్టీ ఉనికి లేని తమిళనాట ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకుపడుతూ పోరాడారామె. మరి ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీకి కొత్త ఆశలు రేగాయి. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది కమలం పార్టీ. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే  అంటోంది. ఇలాంటి నేపథ్యంలో వీరవిధేయురాలిని గవర్నర్ గా పంపించారు. మరి ఆమె గవర్నర్ గా తన డ్యూటీలు  మాత్రమే చేస్తారా..  బీజేపీ గవర్నర్ గా ఉనికి చాటతారా? అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.