అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. చాలా మంది ఆ పార్టీనుంచి బయటకు రావడానికి ఉత్సాహపడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించే ఉద్దేశంతో పలువురు ఉన్నారు. అయితే ఎవరు పార్టీ మారినా సరే.. అనర్హత వేటు వేయడం తథ్యం అని స్పీకరు తమ్మినేని సీతారాం చాలా స్పష్టంగా ప్రకటించేశారు కూడా. అందువల్లే ఫిరాయింపులు ఆగుతున్నాయని, లేకపోతే.. ఈసరికి పదికి పైగా ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయి ఉండేవారని ఒక ప్రచారం ఉంది.
అదే సమయంలో తెదేపాను వీడి తమ పార్టీలోకి వస్తాం అనే ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసి రావాల్సిందే అని జగన్ ఒక కండిషన్ పెట్టాడు. దాంతో వైకాపాలోకి వెళ్లాలనే యోచన ఉన్నప్పటికీ కొందరు పునరాలోచనలో పడ్డారు. కానీ ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాత్రం రాజీనామా చేసి అయినా, వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ ఓకే అన్నారని, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన రాజీనామా లాంఛనం అవుతుందని చెబుతున్నారు.
గొట్టిపాటి రవి ఇదివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి మారారు. 2019 ఎన్నికల్లో సైకిలు గుర్తు మీదనే నెగ్గారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన వైఎస్సార్ కాంగ్రెస్ హవాను ఎదుర్కోవడంలో.. అద్దంకిలో ప్రధానంగా గొట్టిపాటి రవికి ఉన్న సొంత బలమే పనిచేసిందని, అతను అభ్యర్థి కాకపోతే తెదేపా గెలిచేది కాదని చాలా విశ్లేషణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి, వైకాపాలో చేరి మళ్లీ ఫ్యాను గుర్తుపై పోటీచేసి అసెంబ్లీ కి రావడానికి గొట్టిపాటి రవి సిద్ధంగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి రవికి స్థానికంగా కరణం బలరాం కొడుకు వెంకటేష్ తో చాలా చికాకులు ఎదురవుతున్నాయి. తనకు ప్రజాబలం ఉన్నప్పుడు, భవిష్యత్తు కూడా స్పష్టంగా కనిపించని తెలుగుదేశాన్ని నమ్ముకుని ఈ చికాకులు అన్నీ భరిస్తూ ఉండేకంటే, పదవికి రాజీనామా చేసి అయినా వైకాపాలో చేరడం ఉత్తమం అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.