అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు. తనకు అవసరం లేదనుకుంటే.. ఎంత అనుబంధం ఉన్నవారినైనా పక్కకు నెట్టేస్తారు. తనకు ఉపయోగపడతారనుకుంటే.. ఛీ అన్నా వెళ్లి కౌగిలించుకుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ని దువ్వే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఆమధ్య రాజధాని అమరావతి విషయంలో తనతో శృతి కలిపినట్టు కనిపించే సరికి.. ఇదే మంచి అవకాశం అన్నట్టు చెలరేగిపోతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు సందేశం చదివితే ఈ అనుమానం కలగక మానదు.
సహజంగా రాజకీయ ప్రత్యర్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటే మరీ ముక్తసరిగా ఉంటాయి. జగన్ కి, చంద్రబాబు.. చంద్రబాబుకి జగన్ పలుమార్లు ఇలాగే సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్న ఉదాహరణలున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు జనసేనానికి ఇచ్చిన సందేశం.. ఏదో నిగూఢార్థాన్ని చెప్పకనే చెబుతోంది. అశేష ప్రేక్షకాభిమానం సంపాదించిన సినీ నటుడు, విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి, ప్రజల పక్షాన నిలబడి సేవలందిస్తున్న నాయకుడు అంటూ.. పవన్ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో బైటపెట్టారు బాబు.
అసలే పవన్ కల్యాణ్ భోళా మనిషి, ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తారు. సభల్లో తన ప్రసంగాలు విని జనం ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతుంటే.. ఊహల్లో తేలిపోయి ఉనికే కోల్పోయిన రకం. ఇక చంద్రబాబు లాంటి వ్యక్తి తనను పొగిడితే మైమరచిపోకుండా ఉంటారా. బాబుకి కూడా అదే కావాల్సింది. ఇలా సఖ్యత పెంచుకుని ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం అంటూ మెల్లాగ పవన్ ని తన గొడుగు కిందకు లాగేసుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు.
అటు బీజేపీ కూడా ఏపీలో పవన్ ని కావాలనుకుంటోంది. మొత్తమ్మీద వైసీపీకి వ్యతిరేకంగా మరోసారి కూటమి కట్టేందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు. ఇలాంటి గేలాలకు పవన్ కల్యాణ్ చిక్కకుండా ఉంటేనే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉంటుంది. మరోసారి బాబు మాయలో పడితే జనసేన పూర్తిగా నాశనమైనట్టే.