అవును మీరు చదువుతున్నది నిజమే. మెగా చిన్న కూతురు శ్రీజతో ఆమె భర్త కల్యాణ్ దేవ్ విడిగా ఉంటున్నాడు. విడిగా ఉండడమంటే …ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళుతున్నాయా? అబ్బే, ఆ అవసరం లేదు లేండి. అసలు మెగా చిన్నల్లుడు కుటుంబంతో ఎందుకు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివితే తెలుస్తుంది.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌దేవ్. చిన్నల్లుడికి సినిమాలంటే మోజు. అందులోనూ మామ మెగా స్టార్ కావడంతో…తన కోరిక తీర్చుకునే మార్గం సుగుమమైంది. విజేత సినిమాతో అతను వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
ప్రస్తుతం ఆయన సూపర్ మచ్చీ సినిమా చేస్తున్నాడు. కోవిడ్19 కారణంగా సినిమా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా రెండు నెలలకు పైగా ఆగిపోయింది. ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తిరిగి బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి.
సూపర్ మచ్చీ సినిమా షూటింగ్‌లో మెగా చిన్నల్లుడు కల్యాన్ దేవ్ పాల్గొన్నాడు. అయితే కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో కల్యాణ్ కొన్ని స్వీయ నిబంధనలు పెట్టుకున్నాడు. షూటింగ్ జరుగుతున్నంత కాలం తాను కుటుంబ సభ్యులతో కలిసి ఉండకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో తన ఇంట్లోనే గ్రౌండ్ ప్లోర్‌లో స్వీయ నిర్బంధంలో కల్యాణ్ ఉంటున్నాడు. తన భార్య శ్రీజతో పాటు కుమార్తెలను ప్రమాదంలో పడేయడం ఇష్టం లేక తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కల్యాణ్ తెలిపాడు. ఒకే ఇంట్లోనే శ్రీజ, కుమార్తెలు ఒక గదిలో, తాను అదే పరిసరాల్లోని వేరే గదిలో విడివిడిగా ఉండాలని నిర్ణయం తీసుకోవడమే కాదు అమలు చేస్తున్నట్టు కూడా వెల్లడించాడు.
అప్పుడప్పుడు ఫేస్ టైమ్ ద్వారా కూతుర్లతో పాటు భార్య శ్రీజతో కల్యాణ్ మాట్లాడుతున్నాడు. గ్రౌండ్ ప్లోర్‌లో ఉంటున్న కల్యాణ్ తన పనులను తానే స్వయంగా చేసుకుంటుండడం విశేషం. సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. టాకీ పార్ట్ సహా ఒక పాట చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని భయపెడుతున్న తరుణంలో మెగా అల్లుడు తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రశంసనీయంతో పాటు ఆచరణీయం కూడా.