టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రతాపం ఏంటో మహానాడు చూపింది. బహిరంగ వేదికపై తొడ కొట్టి …నా కొడకల్లారా అంటూ ప్రత్యర్థులపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న గ్రీష్మ వ్యవహారశైలిపై కొంత కాలం చర్చ జరిగింది. గ్రీష్మ లాగే మంచి కుటుంబ నేపథ్యం ఉన్న గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష కూడా తన ప్రత్యర్థిపై ఇష్టానుసారం నోరు పారేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రీష్మ, గౌతు శిరీష ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. అసలేం జరిగిందంటే…
అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, 2022లో లబ్ధిదారులకు ఈ పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారనే కారణంతో పలాస టీడీపీ ఇన్‌చార్జ్ గౌతు శిరీష ను ఇవాళ సీఐడీ అధికారులు విచారించారు. దీన్ని శిరీష జీర్ణించుకోలేకపోయారు.
బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న తనను సీఐడీ అధికారులు విచారించడం ఏంటనేది ఆమె ప్రశ్న, నిలదీత. గౌతు లచ్చన్న మనవరాలైన తాను చట్టానికి, విచారణకు అతీతమనే లెవెల్లో ఆమె ఇష్టానుసారం మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. గౌతు శిరీష ఎల్లో చానల్ వేదికగా రెచ్చిపోయారు. తనపై గెలుపొందిన సీదిరి అప్పలరాజుపై రెచ్చిపోయారు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
నిజంగా ఆ పశువుల మంత్రి అప్పలరాజు లాంటోడు తన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఎవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు మా జిల్లాలో ఎలా పుట్టాడో అని ప్రశ్నించారు. ఇలా తనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేతో పాటు సీఎం జగన్, మంత్రి అంబటిపై యథేచ్ఛగా విమర్శలు గుప్పించారు. తన జిల్లాకే చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మానలను విలువలున్న నేతలుగా అభివర్ణించడం విశేషం.
తాత గౌతు లచ్చన్న బీసీలకు ఆరాధ్య దైవమని ఇదే షోలో శిరీష గొప్పగా చెప్పారు. మరి అప్పలరాజు ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడో శిరీష చెప్పాలి. మంచి రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి శిరీష రాజకీయంగా ఎదగడం సులభం. కానీ అప్పలరాజు పరిస్థితి అలా కాదు. అప్పలరాజు స్థానంలో శిరీష ఊహించుకుని, రాజకీయంగా ఎదగడం ఎంత కష్టమో ఆలోచించాలి.
ఎంతో ఘన చరిత్ర కలిగిన కుటుంబ సభ్యురాలైన తనను ఓ సామాన్య కుటుంబానికి చెందిన అప్పలరాజు ఓడించడం జీర్ణించుకోలేక పోతున్నారని ఆమె అసహనం, ఆగ్రహాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఇంకా తాతలు, తండ్రుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవాలనే పరిస్థితులకు కాలం చెల్లిందని శిరీష గుర్తించి, కాస్త సంస్కారవంతమైన భాష మాట్లాడితే ఆమెతో పాటు కుటుంబానికి గౌరవం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీష్మకు పోటీలా తయారు కావాలంటే… ఇక ఆమె ఇష్టం.