అంద‌మైన అబ‌ద్ధాన్ని నిజం చేసేందుకు…!

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఈ రాజ‌కీయ క్రీడ‌లో పైచేయి సాధించేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్…

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఈ రాజ‌కీయ క్రీడ‌లో పైచేయి సాధించేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి బాధాత‌ప్త హృద‌యంతో ప్రెస్‌మీట్ పెట్టిన‌ట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి త‌న‌దైన స్టైల్‌లో గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. కిష‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ఉద్దేశం లేద‌న్నారు. 2023లోనే కాల‌ప‌రిమితి పూర్త‌యిన త‌ర్వాతే ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. స్వామీజీల‌తో ప్ర‌భుత్వాలు కూలిపోతాయా? అని ఆయ‌న నిల‌దీశారు. తెలంగాణ‌లో క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి, టీఆర్ఎస్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతోంద‌న్న ఆవేద‌న‌, తీవ్ర అస‌హ‌నంతో ఫామ్‌హౌజ్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాత ముచ్చ‌ట‌నే ప‌దేప‌దే చెప్పార‌ని కిష‌న్‌రెడ్డి వెట‌క‌రించారు.

స‌ద‌రు వీడియోలో కేసీఆర్ చెబుతున్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కిరాయికి తెచ్చు కున్న ఆర్టిస్టులు, సొంత పార్టీ నేతలతో కలిసి అందమైన అబద్ధాన్ని వీడియో తీశార‌ని ఆరోపించారు. దాన్ని నిజ‌మ‌ని న‌మ్మించేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. అదంతా ఊహాజ‌నిత‌మ‌ని కొట్టి పారేశారు.

రోహిత్‌ రెడ్డి నిజాయితీ పరుడా? అని కిష‌న్‌రెడ్డి నిల‌దీశారు. తెలంగాణ రత్నాలు ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. బ్రోకర్లు త‌మ‌కు అవసరం లేద‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు. బ్రోక‌ర్ల అవ‌స‌రం టీఆర్ఎస్‌కు అవ‌స‌రం ఏమో అని వ్యంగ్యంగా అన్నారు. ఫాంహౌస్‌లో పడుకునే మీకు ప్రజాస్వామ్యం గురించి  మాట్లాడే హక్కు లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి కిష‌న్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.