బీజేపీ-టీడీపీ ఉమ్మడి నాయకుడొకాయన వైసీపీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అదేంటంటే… పోలీస్ అధికారుల చేష్టల్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తగిన సమయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని. ఏ మాత్రం మార్పు లేకుండా, ఇదే మాటతో ఆయన మూడేళ్లుగా బెదిరిస్తూనే ఉన్నారు. అయ్యా, ఆ హెచ్చరికలకు కార్యరూపం ఇవ్వండి అంటే మాత్రం పత్తా లేకుండా పోతున్నాడు. ఇంతకూ ఆ నాయకుడెవరో ఆంధ్రా ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకూ ఆయన వెంట “హచ్” కుక్కలా తిరిగాడు. చంద్రబాబు అధికారం కోల్పోగానే, వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యాడు. అంత వరకూ చంద్రబాబుకు కుడి, ఎడమ భుజాలుగా పేరొందిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ నాయుడు ఒక్కసారిగా పార్టీ మారడంతో టీడీపీ శ్రేణులకు మైండ్ పోయింది. టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాననే కృతజ్ఞతో, మరో కారణం తెలియదు, కానీ రుణం తీర్చుకోవాలని అనుకున్నట్టున్నాడు.
సీఎం జగన్‌ను బెదిరించడానికి పవన్‌కల్యాణ్‌ను అడ్డు పెట్టుకున్నాడాయన. పవన్‌కల్యాణ్‌పై రెక్కీ జరిగిందట, దానికి జగన్ ప్రభుత్వం కారణమన్నట్టు ఆరోపించడం టీడీపీ-బీజేపీ నేతలకే చెల్లింది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే పవన్‌కల్యాణ్‌పై రెక్కీ నిర్వహిస్తారా? అని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించడం గమనార్హం.
వైసీపీ కార్యకర్తల్లా మారిన పోలీసుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఆయన మరోసారి హెచ్చరించడం విశేషం. గత మూడున్నరేళ్లుగా ఈ రకంగా ఆయన చేసిన హెచ్చరిక ఎన్నోసారో ఒకసారి సీఎం రమేశే లెక్క చెబితే బాగుంటుంది.