సీఎం సొంత జిల్లా కడప రాజకీయాల్లో యువనాయకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ యువ నాయకుడే దుష్యంత్‌రెడ్డి. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ దఫా ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్లు ఇవ్వనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ఎవరని జనం చూడలేదు.
కానీ ఈ దఫా అలాంటి రాజకీయ పరిస్థితి వుండదు. ఎందుకంటే జగన్ పరిపాలన, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి ఆ పార్టీకి ఓటు వేయాలా? వద్దా? అని జనం ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వుందనే ప్రచారం జరుగుతోంది. ఫలానా నియోజకవర్గంలో మళ్లీ ఆయనే అభ్యర్థి అయితే, పార్టీ ఓడిపోవడం ఖాయమనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సందర్భంగా కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అలాంటి వారిలో వైసీపీ యువనాయకుడు, పారిశ్రామికవేత్త దుష్యంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ స్వగ్రామం. ముఖ్యంగా కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఈయన గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. సీఎం జగన్‌కు దుష్యంత్‌రెడ్డి సన్నిహితుడితో పాటు సమీప బంధువు కూడా. 2009లో కమలాపురం టికెట్‌ను దుష్యంత్ ఆశించారు.
అప్పట్లో కమలాపురం నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. అయితే తన శిష్యుడైన వీరశివారెడ్డికి అప్పట్లో వైఎస్సార్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇతనికి మంచి పేరు, చెప్పుకోదగ్గ పలుకుబడి వుంది. ప్రస్తుతం ఉన్న నాయకుల కంటే ఇతనైతే బెటర్ క్యాండేట్ అవుతాడనే చర్చ నడుస్తోంది. 2019లో జమ్మలమడుగు నియోజకవర్గ ఎన్నికల బాధ్యతల్ని దుష్యంత్‌కు జగన్ అప్పగించారు. సుధీర్‌రెడ్డి గెలుపులో దుష్యంత్‌ది ఉడత సాయమని చెప్పొచ్చు. మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుష్యంత్‌రెడ్డి పేరు తెరపైకి రావడం కడప జిల్లాలో ఆసక్తికర పరిణామమని చెప్పొచ్చు.