ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, ఖూనీ చేశాడని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శ చేశారు. షర్మిల పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు చేరింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ దగ్గర ఫైలాన్‌ను వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోందని, కాపాడాలని కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వేడుకున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ అసలు నైజాన్ని బయటపెట్టినందుకు సంతోషమన్నారు.
మరి మునుగోడులో కేసీఆర్ చేసింది ఏంటని ఆమె నిలదీశారు. మునుగోడులో నల్లా తిప్పితే మంచి నీళ్లకు బదులు లిక్కర్ వచ్చిందని ఆరోపించారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, ఆ తర్వాత హత్య చేశాడని కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడ్డం… దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? అని షర్మిల నిలదీశారు.
కేసీఆర్ చేస్తే సంసారం, అదే పని మరెవరైనా చేస్తే వ్యభిచారమా? అని నిలదీశారు. కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పిన కాళేశ్వరం …అద్భుతమైన మోసం అని విమర్శించారు. కేసీఆర్ మోసంపై తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రశ్నించ లేదన్నారు. కేవలం తాము మాత్రమే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ కూడా భారీ మోసమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు వాటాలు దక్కడం వల్లే కేసీఆర్ అవినీతిని ప్రశ్నించలేదన్నారు. సీబీఐ తెలంగాణ రాకూడదని జీఓ ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
అవినీతికి పాల్పడకపోతే, నిజాయతీపరులైతే సీబీఐ అంటే ఎందుకు భయమని షర్మిల ప్రశ్నించారు. దమ్ముంటే రొమ్ము చించుకుని ఎవరొస్తారో రాండి అని ఎందుకు అనలేదని షర్మిల నిలదీశారు. కేసీఆర్ దొంగకాకపోతే, సీబీఐని ఎందుకు అడ్డుకున్నారని షర్మిల ప్రశ్నించారు.