సాయిధరమ్ తేజ్‌కు పున‌ర్జ‌న్మే!

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఇది పున‌ర్జ‌న్మే. ప్ర‌మాదానికి సంబంధించి సీసీ కెమేరా పుటేజీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. బైక్ న‌డుపుతూ కింద ప‌డ‌డం, ఆ త‌ర్వాత విసురుగా రోడ్డుపై…

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఇది పున‌ర్జ‌న్మే. ప్ర‌మాదానికి సంబంధించి సీసీ కెమేరా పుటేజీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. బైక్ న‌డుపుతూ కింద ప‌డ‌డం, ఆ త‌ర్వాత విసురుగా రోడ్డుపై ద్విచ‌క్ర వాహ‌నంతో పాటు దొర్ల‌డం, అలాగే ఆ స‌మ‌యంలో ఎలాంటి భారీ వాహ‌నాలు వెళ్ల‌క‌పోవ‌డం …సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఆయువు పోసాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై బ‌య‌ల్దేరాడు. హైద‌రాబాద్ నగరం లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో వెళుతుండ‌గా ఒక్క‌సారిగా వాహ‌నం అదుపు త‌ప్పింది. బైక్‌తో పాటు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా రోడ్డుపై దొర్లుతూ ముందుకు వేగంగా వెళ్లాడు.  

ఆ స‌మ‌యంలో సాయి హెల్మెట్ ధ‌రించి ఉన్నాడు. అయినప్ప‌టికీ శ‌రీరం లోని ఇత‌ర భాగాల‌కు గాయాల‌య్యాయి. కానీ సీసీ కెమేరాలో ప్ర‌మాద దృశ్యం చూస్తే… అత‌ని ప్రాణం గ‌ట్టిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ స‌మ‌యంలో ఇత‌ర వాహ‌నాలేవైనా ఆయ‌న‌పై వెళ్లి వుంటే…ప‌రిస్థితిని ఊహించుకుంటే భ‌యమేస్తుం ద‌ని మెగా అభిమానులు చెబుతున్నారు.

సాధార‌ణంగా న‌గ‌రంలో జ‌రిగే ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మాద వాహ‌నాల‌పై ఇత‌ర వాహ‌నాలు వేగాన్ని నియంత్రించుకోలేక వెళ్ల‌డం, ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ ఉండడం గురించి ఎక్కువ‌గా వింటూ ఉంటాం. కానీ ఇక్క‌డ అలాంటివేవీ చోటు చేసుకోక‌పోవ‌డం సాయి ధ‌ర‌మ్ తేజ్ అదృష్టంగా చెప్పొచ్చు. అంతేకాకుండా, స్థానికులు, పోలీసులు వెంట‌నే స్పందించి 108 సాయంతో స‌మీపంలోని ఆస్ప త్రికి త‌ర‌లించ‌డం మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు. 

ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌మైతే, అనంత‌ర ప‌రిణామాలు సాయిధ‌ర‌మ్ తేజ్‌ను కాపాడ్డంలో కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ఏది ఏమైనా సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌నే స‌మాచారం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.