కమలదళంలో ఎవరికి వారే!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేయడమే లక్ష్యంగా అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నాయకులను ఎడాపెడా తమలో చేర్చేసుకుంటూ ఉంది. అయితే పార్టీలో అంతర్గతంగానే పెద్ద సయోధ్య లేదని, లుకలుకలు…

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేయడమే లక్ష్యంగా అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నాయకులను ఎడాపెడా తమలో చేర్చేసుకుంటూ ఉంది. అయితే పార్టీలో అంతర్గతంగానే పెద్ద సయోధ్య లేదని, లుకలుకలు బయటపడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పలు విధాన అంశాలపై నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా తమకు తోచినదెల్లా మాట్లాడేస్తున్నారు. దీని వల్ల పార్టీ పరువు పోతోంది.

శనివారం నాడు కూడా.. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఒక కీలక నాయకుల సమావేశం జరిగితే, అదే సమయంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మరో ఇంపార్టెంట్ సమావేశం జరగడం విశేషమే. నాయకుల మధ్య సమన్వయం కొరవడిందా.. లేదా.. తమను ఆహ్వానించకుండా హైదరాబాద్ మీటింగు పెట్టినందుకు పోటీగా ఏపీలో నేతలు మరో మీటింగు పెట్టారా అనేది తేలలేదు. ఏదేమైనా ఇలాంటి పరిణామాలు మాత్రం పార్టీకి మేలు చేయవు.

ఒకప్పటి భారతీయ జనతా పార్టీ వేరు. ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలు, అచ్చమైన హిందూత్వ భావజాలం, నైతిక విలువలు, కనీసం- భాజపా సిద్ధాంతాలు తెలిసిన.. వాటిని విశ్వసించే వారు మాత్రమే ఆ పార్టీలో ఉండేవారు. వారెవ్వరూ అధికారం కోసం పాకులాడేవారు కాదు. పదవులు ఉంటే తప్ప పనిచేయకూడదని గిరిగీసుకునే వారు కాదు. అధికార మోహితులై.. నీతి తప్పేవాళ్లు కాదు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల సమస్యల పట్ల తమ ధర్మం ఏమిటో, దానిని నిర్వర్తించేవారు.

కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇతర పార్టీల్లో గతిలేని వారు, నాయకత్వానికి డబ్బు ఎరవేయగలిగిన వారు, కోట్లు గుమ్మరించి లాబీయింగ్ చేయగల సమర్థులు.. ఇలాంటి వాళ్లంతా పార్టీలోకి వెల్లువలా వచ్చేస్తున్నారు. కొత్తొక వింత పాతొక రోత అన్న సామెత చందంగా పార్టీ తయారవుతోంది. పాతనాయకులు అడుగున పడిపోతున్నారు. పార్టీలోని మేధావులకు విలువలేకుండా పోతోంది. ఖచ్చితంగా భాజపాలో కూడా వర్గాలు ఏర్పడుతున్నాయి. శనివారం నాడు అదే కనిపించింది.

హైదరాబాదు, విజయవాడ రెండు చోట్ల ఒకేసారి కీలక పార్టీ నాయకులు విడివిడిగా భేటీలు నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే.. ఏపీ భాజపాలో లుకలుకలు, రెండు వర్గాల భేటీలు అంటూ మీడియాలో ప్రసారం కావడంతో.. ఆ తర్వాత.. ఇలా జరగడం యాదృచ్ఛికమేనంటూ సర్దిచెప్పుకున్నారు. ఇప్పటికి సర్దగలరు.. కానీ.. ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంటాయి.