సాహో సినిమా చూసిన తరువాత చాలా మంది అభిప్రాయం ఇది కూడా లార్గో వించ్ అనే విదేశీ సినిమా ప్రభావితమే అని. అది కాకుండా మరో కామెంట్ ఏమిటంటే, ఇది కూడా అజ్ఞాతవాసి లాంటి డిజస్టర్ మూవీ అని. కానీ ఇక్కడే ఏకీభవించడానికి వీలు కావడం లేదు. ఎందుకని?
అజ్ఞాతవాసి అన్నది టాలీవుడ్ లోని అత్యంత భయంకరమైన డిజాస్టర్లలో ఒకటి. అందులో సందేహం లేదు. ఎంత డిజాస్టర్ అంటే తొలిరోజు సాయంత్రానికే కలెక్షన్లు పడిపోయేటంత. పైగా సంక్రాంతి లాంటి సీజన్ లో సరైన పోటీ లేకుండా విడుదలయింది ఆ సినిమా.
మరో సినిమా సరైనది లేకపోయినా, సంక్రాంతి పండగలో సినిమా అన్నది ఓ భాగం అయినా కూడా, ఆంధ్రలో ఆ సినిమాను పక్కన పెట్టారు. సంక్రాంతికి షో వేయకుండా ఒకటి రెండు థియేటర్లు మూతపడిన చరిత్ర అజ్ఞాతవాసిదే అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరి సాహో విషయానికి వస్తే, ఆ సినిమా మీద వచ్చిన ట్రోలింగ్ కు, వచ్చిన టాక్ కు, వాట్స్ అప్ ల్లో చలామణీ అయిన ప్రచారానికి, తొలి రోజు సాయంత్రానికి బాక్సులు సర్దేయాలి. కానీ స్టడీగా వుంది తొలిరోజు. మలి రోజు కూడా అర్బన్ సెంటర్లలో స్టడీగా వుంది. కేవలం సి సెంటర్లలో ఎక్కువగా, అలాగే బి సెంటర్లలో ఓ మాదిరిగా సమస్య కనిపించింది.
కానీ అజ్ఞాతవాసి అలా కాదు. అన్ని సెంటర్లలో తేడా కొట్టేసింది. అందువల్ల అజ్ఞాతవాసితో సాహోను పోల్చడానికి లేదనే అనుకోవాలి.
అయితే సాహోకి అజ్ఞాతవాసి కి బాక్సాఫీస్ దగ్గర పోలిక లేకపోయినా, కొన్ని పోలికలు వున్నాయి. అవి రెండు సినిమాల వైఫల్యానికి డైరక్టర్ నే కారణం అన్నది ఒకటి. అలాగే హీరో పాటలు, డ్యాన్స్ ల విషయంలో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి పడడం. ఇలాంటివి రెండుసినిమాలకు కామన్ పాయింట్లు.
అంతే కానీ వాణిజ్యపరంగా సాహోకి అజ్ఞాతవాసికి పోలిక పెట్టడానికి లేదు.