దత్తన్నకు ‘రాజ’భోగం!

తెలంగాణలోని సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు గవర్నర్ పదవి లభించింది. దత్తన్న సీనియారిటీని, సుదీర్ఘకాలంగా పార్టీకి అందించిన సేవలను భారతీయ జనతాపార్టీ నాయకత్వం సముచితంగా గౌరవించింది. ఆయన హిమాచల్ ప్రదేశ్…

తెలంగాణలోని సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు గవర్నర్ పదవి లభించింది. దత్తన్న సీనియారిటీని, సుదీర్ఘకాలంగా పార్టీకి అందించిన సేవలను భారతీయ జనతాపార్టీ నాయకత్వం సముచితంగా గౌరవించింది. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. మంచుకొండల్లో ఉండే రాజభవన్ లో ఆయన కొలువుతీరనున్నారు.

బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పెద్దదిక్కు. చిన్ననాటినుంచి పూర్తిగా భాజపాకు అంకితమై పనిచేస్తూ వచ్చారు. తెలంగాణలో భాజపా స్థిరంగా ఉండడానికి ఆయన ఎంతో పాటుపడ్డారు. పార్టీ కూడా ఆయనను తగిన విధంగానే గుర్తించింది. కేంద్రమంత్రిగా ఆయన సేవలందించారు. నిగర్వి, నిరాడంబరుడిగా, నిత్యం కిందిస్థాయి ప్రజలకు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే నాయకుడిగా దత్తాత్రేయకు పేరుంది.

ఆయన రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా చేసినప్పటికీ.. వీసమెత్తు ఆరోపణలు లేకుండా ఆ బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ రహితంగా అందరు నాయకులతో కలుపుగోలుగా, స్నేహశీలిగా ఉండే వ్యక్తిగా దత్తాత్రేయకు చాలా గుర్తింపు ఉంది. ఆ రకంగా ఆయన అందరివాడు. ఆయన ఏటా నిర్వహించే అలైబలై కార్యక్రమానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించి ఆదరిస్తుంటారు. ఇన్ని రకాలుగా ఆయనకు మంచి పేరు ఉంది.

ఇన్నాళ్లకు ఆయన సీనియారిటీకి, పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. దత్తాత్రేయను గవర్నరుగా నియమించారు. అలాగే తెలంగాణ కొత్త గవర్నరుగా తమిళనాడుకు చెందిన పార్టీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ను నియమించారు. రాజస్తాన్  కు కల్రాజ్ మిశ్రా, మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారి, కేరళకు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్లుగా నియమితులయ్యారు.