తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత సేపూ ముందూవెనుక చూసుకోకుండా ఎగిరెగిరి పడ్డారు. తమకు ఓటమే లేదు అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడారు. అయితే తమ పాలనలో తమ చాపకిందకే నీళ్లు వచ్చినట్టుగా వాళ్లు గుర్తించలేకపోయారు. గత కొన్నేళ్లుగా ఓటమి ఎరగనివాళ్లు చిత్తుగా ఓడారు. ఇక అలా ఓడారో లేదో.. ఇంతలోనే పార్టీ ఫిరాయింపుకు రెడీ అయ్యారు. జగన్ పిలుస్తారేమో అని సదరునేతలు ఆశగా ఎదురుచూసినట్టుగా ఉన్నారు. అయితే వారి అవసరం లేదని ఎన్నికల ముందే నిర్ధారించుకున్న జగన్‌కు ఇప్పుడు వారి అవసరం ఏ మాత్రమూ కనిపించడం లేదు. రాజకీయ పరిశీలకులే ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు.
ఇలాంటి క్రమంలో అటు జగన్ తలుపులు మూసేయడంతో భారతీయ జనతా పార్టీ మీద ఆశలు పెట్టుకుని అటుగా చూశారు. అయితే భారతీయ జనతాపార్టీ ఏపీలో ఏ మేరకు పుంజుకుంటుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. బీజేపీ పప్పులు ఏపీలో ఇప్పటివరకూ గట్టిగా ఉడికిందిలేదు. మరీ సున్నా పాయింట్ ఎనిమిదీ నాలుగుశాతం ఓట్లను కలిగిన పార్టీ అది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి దూకి ఏదో చేసేద్దాం అనుకుంటే మొదటికే మోసం వస్తుందేమో అని ఈ నేతలు భావిస్తున్నట్టుగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉంటే అధికారం లేకపోయినా కనీసం క్యాడర్ అయినా ఉంది. భవిష్యత్తుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాము కష్టపడితే మళ్లీ ఏ ఎంపీలుగానో, ఎమ్మెల్యేగానో గెలవొచ్చు. అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని మురిసిపోవడం తప్ప.. ఆ ఒక్కశాతం లోపు ఓటు బ్యాంకుతో ఎప్పటికి నెగ్గుకురావాలి? అనేది నేతల మీమాంసగా తెలుస్తోంది. మరీ కాంట్రాక్టులు, కేసుల భయం ఉన్నవారు తప్ప మిగతావాళ్లు బీజేపీ వైపుకు దూసుకు వెళ్లడానికి ఉత్సాహం చూపించడం లేదు.
అలాగని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వీరు మరీ ఎక్కువగా రాసుకుపూసుకోవడం లేదు. కామ్‌గా రాజకీయ పరిణామాలను ఈ నేతలు గమనిస్తున్నట్టుగా ఉన్నారు. అయినా ఈ నేతలకు అంత టాలెంటే ఉంటే ఇటీవల ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ బండిని దిగేసేవారు కదా? అనే అభిప్రాయాలూ వీరి విషయంలో వినిపిస్తుండటం గమనార్హం.