'మీరిద్దరూ వాటాలు వేసుకుని వచ్చిన ప్రతి రూపాయినీ పంచుకున్నట్టుగా ఒప్పుకున్నారు. వాటాలు తేలాయి కాబట్టి గొడవలు లేవని ప్రకటించుకున్నదీ మీరే. అలా పంచుకుని, సాంతం నాకేసి.. ఇప్పుడు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా?' అంటూ రామసుబ్బారెడ్డి మీద విరుచుకుపడ్డారు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.
సోలార్ ప్లాంట్ సంస్థ నుంచి సుధీర్‌రెడ్డి వసూళ్లు సాగించారు, అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగించారు.. అంటూ ఆరోపణలు చేసిన రామసుబ్బారెడ్డికి సుధీర్‌రెడ్డి ఈ రకంగా సమాధానం ఇచ్చారు. జమ్మలమడుగు రాజకీయం ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు నేతలున్న సంగతి తెలిసిందే.
వారిలో ఒకరు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఆయన మరెవరో కాదు మాజీమంత్రి వర్యులు ఆదినారాయణ రెడ్డి. తను మంత్రిగా ఉన్నరోజుల్లో ఆదిరానాయణ రెడ్డి ఎంత హడావుడి చేశారో తెలిసిన సంగతే. ఫిరాయించి మంత్రిపదవిని పొంది జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడిన వారిలో ఆదినారాయణ రెడ్డి ముందున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి మారు మాట్లాడటంలేదు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో అన్నట్టుగా ఆదినారాయణ రెడ్డి గప్‌చుప్ అయ్యారు.
దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు కలిసి పనిచేసి కూడా నెగ్గుకురాలేకపోయారు. ఫ్రెష్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుధీర్‌రెడ్డి చేతిలో చిత్తు అయ్యారు. ఇలాంటి క్రమంలో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండే కష్టమే అన్నట్టుగా వేరే మార్గాన్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరే అవకాశాలున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన బీజేపీలోకి జంప్ కావడమే తరువాయి అనే అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి మాత్రం నోటికి పనిచెబుతూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి అటు వెళ్లిపోతే తనే తెలుగుదేశం అన్నట్టుగా రామసుబ్బారెడ్డి భావిస్తున్నారు. అందుకే సుధీర్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు.
కానీ గత ఐదేళ్లలో ప్రతి రూపాయిలోనూ వాటాలు వేసుకుని పంచుకున్న వైనాన్ని ఆదినారాయణ రెడ్డి పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితో తనకేం వైరంలేదని, తమ మధ్య వాటాల పంపకాలు సవ్యంగా ఉన్నాయి కాబట్టి.. తామిద్దరం ఇక గొడవ పడాల్సిన అవసరం లేదని అప్పట్లో ఆదినారాయణ రెడ్డి తేల్చిచెప్పారు. అలా వాటాల పంపకం గురించి ఆయన పబ్లిక్‌గానే చెప్పాకా కూడా ఇప్పుడు రామసుబ్బారెడ్డి నీతిమంతుడి లెక్చర్లు ఇస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. 'సాంతం మీరే నాకేశారు. సోలార్ ప్లాంట్ నుంచి మీరు ఎంత వసూలు చేశారో, అందులో నీకు దక్కింది ఏమిటో అందరికీ తెలుసు. సోలార్ ప్లాంట్ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్లను ఉద్యోగాల నుంచి తీయించడం కూడా అబద్ధమే, ప్లాంట్ నిర్మాణ పనులు అప్పుడు ఎక్కువమంది అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఆ పనులు పూర్తి కావడంతో ఆ సంస్థ వారిని వెనక్కు పంపించింది. అది గమనించుకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు..' అంటూ రామసుబ్బారెడ్డికి సుధీర్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.