నేనూ క‌శ్మీరీ పండిట్ నే: రాహుల్

త‌ను కూడా క‌శ్మీరీ పండిట్ నే అంటూ ప్ర‌క‌టించుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌శ్మీరీ పండిట్ల స‌ద‌స్సు ఒక‌దానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా రాహుల్ త‌న‌కు క‌శ్మీర్…

త‌ను కూడా క‌శ్మీరీ పండిట్ నే అంటూ ప్ర‌క‌టించుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌శ్మీరీ పండిట్ల స‌ద‌స్సు ఒక‌దానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా రాహుల్ త‌న‌కు క‌శ్మీర్ ఇల్లు లాంటిద‌న్నారు. త‌ను కూడా క‌శ్మీర్ పండిట్ నేనంటూ త‌న మూలాల‌ను త‌లుచుకున్నారు రాహుల్. 

పండిట్ జ‌వ‌హార్ లాల్ నెహ్రూ వారసుడిగా రాహుల్ త‌న‌ను క‌శ్మీరీ పండిట్ గా పేర్కొన్నార‌నుకోవాలేమో. గ‌తంలో కూడా రాహుల్ గాంధీ హిందూ ఐడెంటిటీ గురించి కాంగ్రెస్ వాళ్లు హైలెట్ చేసేప్ర‌య‌త్నాలు చేశారు. రాహుల్ జంధ్యం ధ‌రించే హిందువ‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. గ‌తంలో కూడా రాహుల్ త‌న పండిట్ ఐడెంటిటీని చెప్పుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న ఆ విష‌యాన్ని క‌శ్మీర్ నుంచే ప్ర‌క‌టించుకున్నారు.

నిన్న రాహుల్ గాంధీ అక్క‌డే వైష్ణోదేవి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. 13 కిలోమీట‌ర్ల న‌డ‌క‌దారిన సాగి రాహుల్ గాంధీ ఆ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు.  ఆ సంద‌ర్భంగా రాహుల్ ఎలాంటి రాజ‌కీయాలూ మాట్లాడ‌లేదు. సద‌స్సులో మాత్రం అటు బీజేపీపై విరుచుకుప‌డ్డారు.

క‌శ్మీరీ పండిట్ల‌కు బీజేపీ ఏం చేసిందంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌శ్మీర్ కు దూర‌మైన పండిట్ల‌కు కాంగ్రెస్ పార్టీ ప‌లు ర‌కాలుగా తోడ్పాటును ఇచ్చింద‌న్నారు. వారికి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని కూడా ప్ర‌క‌టించింద‌న్నారు. బీజేపీ వ‌చ్చాకా.. ఆ ప‌థ‌కాన్ని కొండెక్కించార‌న్నారు. త‌ను వైష్ణోదేవి ఆల‌యాన్ని సంద‌ర్శించిన విష‌యాన్ని రాహుల్ ప్రస్తావించారు.

క‌శ్మీర్ ప‌రిస‌రాల‌న్నీ త‌న‌కు హోమ్లీ ఫీలింగ్ ఇస్తాయ‌న్నారు. ఇటీవ‌లే రాహుల్ ఒక‌సారి క‌శ్మీర్ లో ప‌ర్య‌టించారు కూడా. ఇది రెండో ప‌ర్య‌ట‌న‌. అప్పుడు ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లారు.  ఇక‌పై కూడా త‌ను ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌నున్న‌ట్టుగా, త్వ‌ర‌లోనే ల‌ఢ‌క్ లో కూడా ప‌ర్య‌టించ‌నున్నట్టుగా రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు.