టార్గెట్ తెదేపా కాదు వైకాపానే!

భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని కలలు కనడం తప్పేం కాదు. కాకపోతే.. అందుకు తగినట్లుగా.. వారు రాష్ట్రం మీద శ్రద్ధ పెట్టాలి. రాష్ట్ర ప్రగతికి కేంద్రం తరఫున సహకరించాలి. రాష్ట్ర అభ్యున్నతి…

భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని కలలు కనడం తప్పేం కాదు. కాకపోతే.. అందుకు తగినట్లుగా.. వారు రాష్ట్రం మీద శ్రద్ధ పెట్టాలి. రాష్ట్ర ప్రగతికి కేంద్రం తరఫున సహకరించాలి. రాష్ట్ర అభ్యున్నతి పట్ల భాజపా చిత్తశుద్ధితోనే ఉన్నదనే నమ్మకం ప్రజల్లో కలిగించాలి. అలాంటి గట్టి ప్రయత్నాలేమీ చేయకుండా.. పార్టీ ఎదిగిపోవాలంటే కుదరదు. అంతకు మించిన కామెడీ ఏంటంటే.. నిన్నటిదాకా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అని మాట్లాడుతూ ఉన్నటువంటి భాజపా నాయకులు.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కే ప్రత్యామ్నయాం కావాలని అనుకుంటున్నారు.

హైదరాబాదులోని ఏపీ భాజపా అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో శనివారం కీలక నాయకుల భేటీ జరిగింది. పార్టీని అర్జెంటుగా గేరప్ చేసి.. బలోపేతం చేసేయడం ఎలాగ అనేదాని గురించి కీలక నేతలందరూ  చర్చలు సాగించారు. ఈ క్రమంలోనే నిన్నటిదాకా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం.. అన్న నాయకులు, ఇవాళ వైకాపాకు ప్రత్యామ్నాయం కావాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకోవడం విశేషం. తమకంటూ సొంత బలంలేని, నేరుగా ప్రజలు ఆదరించే ఎన్నికల్లో గెలిచిన అనుభవం లేని ఏదో నలుగురు నాయకులు వచ్చి తమ పార్టీలో చేరిపోగానే.. భాజపాకు కన్నూమిన్నూ కానకుండా పోయినట్లుంది.

ఏపీలో భాజపాలోకి తెదేపా, ఇతర పార్టీల నాయకులు ఇంకా వలస వస్తూనే ఉన్నారు. కానీ ప్రజల్లో ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు మాత్రం లేదు. వారు రాష్ట్రం కోసం ఇప్పటిదాకా తాము చేసిన మేలు ఇదీ అని చెప్పుకోగల స్థితిలో లేరు. అన్నీ డొంకతిరుగుడు డైలాగులే చెబుతున్నారు. రాష్ట్ర సంక్షేమానికి ఏమాత్రం ‘ప్రత్యేక’ శ్రద్ధ పెట్టడం లేదు. ప్రత్యేకహోదా ఎగవేసిన వారు, ప్రత్యామ్నాయ మేలు ఏమిటో కూడా చెప్పడం లేదు. పోలవరాన్ని అనాధలా వదిలేశారు. విశాఖ రైల్వే జోన్ ను వాల్తేరు లేకుండా డస్ట్ బిన్ లాగా సృష్టించారు. చివరకు తాజాగా ఆంధ్రబ్యాంకు పేరిట ఉన్న ఆంధ్రుల అస్తిత్వాన్ని కూడా సర్వనాశనం చేసేసి, దాన్ని యూనియన్ బ్యాంకులో కలిపేశారు. ఈ రకంగా భాజపా సర్కారు ఏపీ మీద కక్ష కట్టినట్టుగా అన్నీ ద్రోహాలే చేస్తున్నది. మరి అదే రాష్ట్ర్రంలో అధికార పార్టీకే ప్రత్యామ్నాయం కాగలిగేతం ప్రజాదరణను ఎలా చూరగొంటుంది..?