వైఎస్‌ వివేకా హత్య విచారణలో ఏం జరుగుతోంది?

ఎన్నికల ముందు సంచలనం రేపిన అంశం మాజీఎంపీ, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్య. రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార హడావుడి తీవ్రస్థాయిలో ఉండగా.. ఆ సమయంలో వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపింది. ఆ హత్యపై అనేక…

ఎన్నికల ముందు సంచలనం రేపిన అంశం మాజీఎంపీ, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్య. రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార హడావుడి తీవ్రస్థాయిలో ఉండగా.. ఆ సమయంలో వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపింది. ఆ హత్యపై అనేక అనుమానాలు రేగాయి. తెలుగుదేశం పార్టీ ఆ హత్యను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మెడకే చుట్టాలని తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు సంబంధించి విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

జగన్‌కు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆ హత్యతో ఏ సంబంధాలు అయినా ఉంటే ఎన్నికల వేడిలో తెలుగుదేశం పార్టీ చెలరేగిపోయేదనేది ప్రముఖంగా వినిపించిన విశ్లేషణ. అక్కడకూ చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల సభలోనూ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడసాగారు. జగన్‌కు పాలన అప్పగిస్తే శాంతిభద్రతలు దెబ్బతింటాయంటూ చంద్రబాబునాయడు ప్రచారం చేశారు. వివేక హత్యను అలా రాజకీయంగా వాడుకునేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగానే ప్రయత్నించారు.

ఒకవేళ ఆ హత్యతో వైఎస్‌ కుటుంబీకులు ఎవరికి సంబంధం ఉన్నా.. తెలుగుదేశం పార్టీ వారిని అరెస్టు చేయించి దాన్ని మరింత సంచలనం చేసి, జగన్‌కు చుట్టేది అనడానికి ఎవరూ సందేహించనక్కర్లేదు. అందుకోసం తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి కూడా. అయితే అలాంటి అవకాశం దక్కకపోవడం, వివేక హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడాన్ని కోర్టు కూడా ఆక్షేపించడంతో చంద్రబాబునాయుడు వెనక్కుతగ్గాల్సి వచ్చింది.

ఇక వైఎస్‌ వివేక హత్యకు  సంబంధించి ఎన్నికల ముందే కొందరు నిందితులను అరెస్టు చేశారు. వివేకానందరెడ్డిని బాగా ఎరిగిన వారిని అప్పుడు అరెస్ట్‌ చేశారు. వారు అప్పటి నుంచి పోలీస్‌ కస్టడీలో కొనసాగుతూ ఉన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. ఈ పరిణామాల్లో నిందితుల నార్కో ఎనాలిస్‌ టెస్ట్‌లకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌  ఇచ్చింది. నిందితులు కూడా ఆ పరీక్షను ఎదుర్కొనడానికి సిద్ధమని కోర్టు ముందు చెప్పారు. దీంతో విచారణ ఇప్పుడు అటుగాసాగుతూ ఉంది.