సౌత్‌పై కన్నేసిన డిజిటల్‌ స్ట్రీమింగ్

కొత్తగా ఏమీకాదు.. ఇదివరకూ ఒకటీ రెండు వెబ్‌ సీరిస్‌లను తయారు చేయించారు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్లికేషన్ల వాళ్లు. అయితే అప్పుడు అవి వర్కవుట్‌ కాలేదు. ఇంగ్లిష్‌ వెబ్‌సీరిస్‌లులా, హిందీలో సక్సెస్‌ అయినట్టుగా తెలుగు నెటిజన్లకు…

కొత్తగా ఏమీకాదు.. ఇదివరకూ ఒకటీ రెండు వెబ్‌ సీరిస్‌లను తయారు చేయించారు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ అప్లికేషన్ల వాళ్లు. అయితే అప్పుడు అవి వర్కవుట్‌ కాలేదు. ఇంగ్లిష్‌ వెబ్‌సీరిస్‌లులా, హిందీలో సక్సెస్‌ అయినట్టుగా తెలుగు నెటిజన్లకు ఆ వెబ్‌ సీరిస్‌లు ఎక్కలేదు. బహుశా వాటిని తీసినవారు సరిగా తీయకపోవడం వల్లనో లేక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ ఇంత వైడ్‌గా అందుబాటులోకి రాకపోవడం వల్లనో కానీ.. తెలుగులో ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ల వెబ్‌సీరిస్‌లో అంతగా ఆకట్టుకోలేదు. అలావచ్చి వెళ్లాయంతే!

అయితే తెలుగులో సినీప్రియుల రూటు మారింది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ వినియోగం గత రెండేళ్లలో విపరీతంగా పెరిగింది. అమెజాన్‌ ప్రైమ్‌కు అప్‌గ్రేడ్‌ అయితే పలు రకాలుగా లబ్ధి కలుగుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో మెంబర్‌ అయితే ఆర్డర్ల డెలివరీ వేగంగా ఉంటోంది. అదే సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అప్‌లోడ్‌ అయ్యే సినిమాలను ఎంచక్కా చూసేయవచ్చు. రెండురకాల లబ్ధి ఉండటంతో చాలామంది అమెజాన్‌లో ప్రైమ్‌మెంబర్స్‌ అవుతూ ఉన్నారు.

థియేటర్లలో సినిమాల టైటిల్‌ కార్డులు పడుతున్నప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ పేరు పడితే ప్రేక్షకులు ఖుష్‌ అవుతున్నారు. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌గా అమెజాన్‌ ఉందంటే.. ఆ సినిమాను త్వరలోనే అమెజాన్లో చూసేయవచ్చు అనే ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక థియేటర్లో మిస్‌ అయిన సినిమాలు కచ్చితంగా నెలన్నరలో అమెజాన్లో వచ్చేస్తుండటంతో ఆ యాప్‌ కోసం సంవత్సరానికో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేందుకు జనాలు అంత భారంగా ఫీల్‌ కావడంలేదు!

కేవలం తెలుగు సినిమాలే కాదు.. అమెజాన్‌ ప్రైమ్‌లోకి వెళితే అదో సినీ సముద్రమే. సినీ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో సినిమాలు, యూట్యూబ్‌లో లభించనవి ఉండటంతో సినీప్రియులు పండగ చేసుకుంటున్నారు. అమెజాన్‌ అలా చేరువైపోగా.. ఇంతలోనే మరో తిరకాసు వచ్చింది. బోలెడన్ని డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ పలకరిస్తూ ఉన్నాయి. సన్‌నెట్‌ వర్క్‌ వాళ్లది ఒకటి ఉంది, జీ నెట్‌వర్క్‌ వాళ్లది ఇంకోటి, ఆపై నెట్‌ఫ్లిక్స్‌ సరేసరి! ఇలా ఒక్కో ప్రముఖ నెట్‌ వర్క్‌ వాళ్లు ఒక్కో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ జనాల మీదకు వదులుతుండే సరికి అన్నింటికీ సబ్‌స్క్రైబ్‌ కావడం కూడా కష్టం అయిపోయింది. చాలామంది నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లను సబ్‌స్క్రైబ్‌ అవుతూ ఉన్నారు!

ఈ క్రమంలో దక్షిణాది ప్రాంతీయ భాషల్లో కూడా తమ నెట్‌వర్క్‌ను పెంపొందించుకోవడానికి సదరు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ మరింత కసరత్తు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా సౌత్‌లో వెబ్‌ సీరిస్‌లను ప్లాన్‌ చేస్తున్నాయి. రెండేళ్ల కిందటే ఇలాంటి ప్రయత్నాలు జరిగినా అప్పుడు వర్కవుట్‌ కాలేదు. అయితే  అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలామార్పులు వచ్చాయి. ఈసారి సక్సెస్‌ విషయంలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ ఫుల్‌ కాన్పిడెన్స్‌తో కనిపిస్తూ ఉన్నాయి.

ఈసారి అల్లాటప్పాగా కాకుండా.. కొందరు ప్రముఖ దర్శకులతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌. వారిలో తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, తెలుగులో సంకల్ప్‌ రెడ్డి వంటివాళ్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన దర్శకులతో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ ఒప్పందం చేసుకుంటున్నాయట. వారిచేత ముందుగా కొన్ని రీమేక్‌ వెబ్‌ సీరిస్‌లు రన్‌ చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా హిందీలో హిట్టైన వెబ్‌ సీరిస్‌లను ముందుగా రీమేక్‌ చేయించనున్నట్టుగా సమాచారం.

హిందీలో హిట్టైన లస్ట్‌ స్టోరీస్‌, శాక్రెడ్‌ గేమ్స్‌ వంటి వెబ్‌ సీరిస్‌లు త్వరలోనే తెలుగులో రీమేక్‌ కానున్నాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ వీటిని తీయించడానికి కసరత్తు మొదలైనట్టుగా సమాచారాం. హిందీలోనూ ఈ వెబ్‌ సీరిస్‌లకు ప్రముఖ దర్శకులే పనిచేశారు. వారి పేరు కూడా ఆ వెబ్‌ సీరిస్‌లకు కలిసి వచ్చింది. అందుకే సౌత్‌లో కూడా ప్రముఖ దర్శకులకు వాటి రీమేక్‌ బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా ఉన్నారు.

హిందీలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ వెబ్‌ సీరిస్‌లు తెలుగులోనూ ఆకట్టుకుంటాయనే నమ్మకంతో వాటి రీమేక్‌లకు కసరత్తు చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈసారి ప్రముఖ దర్శకులు, ఆల్రెడీ హిట్టైన కాన్సెప్టు కావడంతో సక్సెస్‌ గ్యారెంటీ అనే అంచనాలున్నాయి. ఇక తెలుగులో కూడా కొంతమంది దర్శకులు వెబ్‌ సీరిస్‌లదే నెక్ట్స్‌ అంతా! అంటున్నారు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కొన్ని ప్రయత్నాలు చేశాడు. యూట్యూబ్‌ స్థాయి కటెంట్‌ క్రియేట్‌ చేసి వదిలాడు. అయితే వర్మది ఆరంభశూరత్వం మాత్రమే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.

అందుకే రామ్‌గోపాల్‌ వర్మ హడావుడి అంతా మూడునాళ్ల ముచ్చటగా మిగిలింది. ఫ్యాక్షనిజం మీద ఏదో వెబ్‌ సీరిస్‌ అనౌన్స్‌ చేసి  వర్మ ఒకటీ రెండు ఎపిసోడ్లతో దానికి మంగళం పాడేశాడు. తెలుగులో వెబ్‌ సీరిస్‌లకు సరైన మార్కెట్‌ లేకపోవడం, కేవలం యూట్యూబ్‌ యాడ్స్‌ మీద అలాంటి ప్లాన్లు వర్కవుట్‌ అయ్యేవి కావకపోవడంతో మిగతావాళ్లు ఎవరైనా ఆ ప్రయత్నాలు చేయాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

అలాకాకుండా అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి రంగంలోకి దిగితే దర్శకులకు కూడా ధీమా కలగడం ఖాయం. ఆరంభంలో నష్టాలను తట్టుకోవడానికి అలాంటి సంస్థలు ధీమాగా ఉంటాయి. మొదట్లోనే అవి రిటర్న్స్‌ ఆశించవు కూడా. దీంతో దర్శకులపై అంత ఒత్తిడి ఉండదు. ఇక భవిష్యత్తులో జనాలకు థియేటర్లకు వెళ్లేంత ఓపిక ఉండదు, అంతా డిజిటల్‌ స్ట్రీమింగ్‌దే రాజ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిలో పూరీ జగన్నాథ్‌ కూడా ఒకరు.

ఇదివరకే పూరీ కూడా ఆ థియరీని చెప్పాడు. ముందు ముందు సినిమాలను థియేటర్లో విడుదల చేసే పద్ధతి పోతుందని..వెబ్‌ సీరిస్‌లదే రాజ్యం అవుతుందని పూరీ సూత్రీకరించాడు. ఆ మార్పుకు రెడీగా ఉండాలన్నట్టుగా మాట్లాడాడు. ప్రేక్షకుల తీరు కూడా క్రమక్రమంగా అటుగా సాగుతూ ఉంది. టెక్నాలజీ మరింతగా అభివృద్ధి బాటపడితే.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌, వెబ్‌ సీరిస్‌ల హవా కూడా మరింతగా పెరగడం ఖాయంకావొచ్చు. పరిణామాలు అన్నీ ఆ దిశగానే సాగుతున్నట్టుగా ఉన్నాయి!