సీనియర్ పొలిటీషియన్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు వస్తున్నాయి. ఆయన రెండు కిడ్నీలూ దెబ్బతిన్నాయని.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం అని వైద్యులు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. 71 యేళ్ల వయసున్న ఈ రాజకీయ నేత ప్రస్తుతం తన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆయన ఆరోగ్యపరిస్థితి బాగోలేకపోవడంతో రాంచీలోని ఒక ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు ప్రకటించారు. దాణా కుంభకోణంలో సుదీర్ఘ విచారణ అనంతరం లాలూ జైలు పాలైన సంగతి తెలిసిందే.
బిహార్ కు ముఖ్యమంత్రిగానే గాక.. కేంద్రంలోనూ లాలూ ప్రసాద్ యాదవ్ మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రైల్వేమంత్రిగా లాలూ సమర్థవంతంగా వ్యవహరించారనే పేరును తెచ్చుకున్నారు.