అలవిమాలిన అవినీతికి, అక్రమాలకు తెరతీసిన సౌర, పవన విద్యుత్తుల పీపీఏలను సమీక్షించాలని జగన్మోహనరెడ్డి సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పీపీఏల ప్రకారం విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం మీద పడే భారం చాలా ఎక్కువగా ఉండడంతో వాటిని సమీక్షించాలని, అవసరమైతే ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని.. వారినుంచి విద్యుత్తు కొనుగోలు థరలను తగ్గిస్తే ఖజానాపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. అయితే ఈ విషయంలో ఢిల్లీలోని విద్యుత్తు అప్పిలేట్ ట్రిబ్యునల్ నుంచి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
విద్యుత్తు పీపీఏలను రద్దు చేయవద్దని, వీటిని సమీక్షించాల్సిన, ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం కూడా లేదని ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుమారుగా వారంరోజుల వ్యవధిలో జగన్ ప్రభుత్వానికి తగిలిన రెండో ఎదురుదెబ్బ ఇది! పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాన డ్యాం, జల విద్యుత్తు కేంద్రం రెండు కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసేసినప్పుడు.. నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
పవర్ ప్రాజెక్టు రద్దు చెల్లదని, వారినే కొనసాగించాలని, జెన్‌కోను ఆదేశిస్తూ, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం రీటెండర్ల ప్రక్రియ కూడా ఆపాలని నిర్దేశించింది. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో.. తొలి ఎదురుదెబ్బ అది. వారం రోజులు గడిచాయో లేదో.. విద్యుత్తు పీపీఏ ల సమీక్ష విషయంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పీపీఏల సమీక్షకు జగన్ సర్కారు సంస్థలకు నోటీసులు ఇవ్వగానే వారు ట్రిబ్యునల్ ను ఆదేశించారు.
రెండునెలల పాటు వాదోపవాదాలను విన్న ట్రిబ్యునల్ శనివారం తీర్పు చెప్పింది. పాత ఒప్పందాలనే కొనసాగించాలని పేర్కొంది. జగన్ సర్కారు విద్యుత్తు పరంగా ప్రజలకు అనేక రకాలు మేలు చేయాలని సంకల్పించింది. రైతులకు ఇచ్చే ఉచితవిద్యుత్తుతోపాటు, గిరిజనులకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కారణాల వల్ల, కొనుగోలు దశలోనే ప్రభుత్వంపై భారం తగ్గించుకోవాలని అనుకుంది.
థర్మల్ విద్యుత్తు చాలా తక్కువ ధరకే కొంటుండగా, సౌర పవన విద్యుత్తులను మాత్రం భారీ ధరకు పీపీఏలు కుదుర్చుకోవడం ప్రభుత్వాన్ని విస్మయపరచింది. వాటిని సమీక్షించడానికి చేసిన ప్రయత్నానికి ట్రిబ్యునల్ బ్రేక్ వేసింది. ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.