పవన్ బాబా.. భలే భూతవైద్యం!

పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించారు. మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత గ్రామాల రైతులతో భారీ సమావేశం కూడా నిర్వహించేశారు. ఆ సమావేశంలో.. వారికి ఆయన…

పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించారు. మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత గ్రామాల రైతులతో భారీ సమావేశం కూడా నిర్వహించేశారు. ఆ సమావేశంలో.. వారికి ఆయన వరం కూడా ప్రసాదించేశారు. ఏమని..? ‘రాజధాని ఇక్కడనుంచి తరలదు..’ అని! ఈమేరకు రైతులకు హామీ ఇస్తున్నా అని చెప్పారు. తరలిస్తానంటే చూస్తూ ఊరుకోనని కూడా చెప్పారు.

పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తోంటే.. భూతవైద్యం చేస్తున్నట్లుగా ఉంది. అవును. ఎందుకంటే..
ఎవరో ఒక ఆడపడచు ప్రవర్తనలో రోజువారీ తీరుకంటే కాస్త తేడా కనిపిస్తుంది. ఆ తేడా ఒక్కోసారి కాస్త అతిగా కూడా కనిపిస్తుంది. దారినపోయే దానయ్య ఒకడు.. అరెరే దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. ఇది దెయ్యం పట్టడమే… అని ఒకమాట వదిలేసి తన దారమ్మట తాను చక్కాపోతాడు. ఆ ఇంట్లో వాళ్లంతా… ‘ఏం చేయాల్రా భగవంతుడా.. ఈమెను దెయ్యం పట్టుకుందే..’ అని ఏడుస్తూ.. పెడబొబ్బలు పెడుతూ.. భూతవైద్యుడిని సంప్రదిస్తాడు. భూతవైద్యుడు వారి చెప్పింది మొత్తం వింటాడు… అంతా విన్న తర్వాత.. ‘ఇది ఖచ్చితంగా దెయ్యం పనే’ అని తేలుస్తాడు. నేనే వొస్తా.. వచ్చి దెయ్యాన్ని వదిలిస్తా.. అని అంటాడు.

వారి ఇంటికి వెళతాడు.. వెంట్రుకలు, ఎర్రనీళ్లు, నిమ్మకాయలు, గుమ్మడికాయ, టెంకాయ లాంటివి పట్టుకుని.. ఇల్లంతా తిరుగుతాడు. ఆమెను వేపాకు మండలతో నాలుగు దెబ్బలు కొడతాడు. అంతా అయిన తర్వాత.. ఆ ఇక్కడ దెయ్యం ఉంది అంటాడు. నడింట్లో ముగ్గువేసి.. పూజలు చేసి.. నేనున్నా.. హామీ ఇస్తున్నా.. దెయ్యం వెళ్లిపోయినట్టే.. మళ్లీ వచ్చినా నేను చూసుకుంటా.. అని వారికి ఊరట కలిగిస్తాడు.

పవన్ కల్యాణ్ – ‘రాజధాని భూతవైద్యం’ అచ్చం ఈ స్క్రిప్టు లాగానే ఉంది. ఏదో కొన్ని తేడా మాటలు మంత్రినుంచి వచ్చాయి. భాజపా, తెదేపా నేతల్లాంటి దానయ్యలు.. రాజధాని తరలిపోతోందనే భయం పుట్టించారు. రైతులు పోలోమంటూ హైదరాబాదుకు వచ్చి పవన్ ను కలిశారు. పవన్ వెళ్లి అక్కడ పర్యటించి అవును తరలించే ఆలోచన ఉంది అని తేల్చాడు. ప్రభుత్వం మీద నాలుగు విమర్శలు చేశాడు. మధ్యలో కులం రంగు కూడా పులిమాడు. తరలిస్తే ఊరుకోను అని హెచ్చరించాడు. ఇక విమానమెక్కి హైదరాబాదు వచ్చేస్తాడు. అక్కడితో భూతవైద్యం పూర్తియపోతుంది.

ఇంతకూ విషయం ఏంటంటే.. అసలక్కడ భూతమే లేదు. రాజధాని తరలిపోతోందనే మాటే ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ.. భూతవైద్యుడి రంకెలు, పెడబొబ్బలు, ధైర్యవచనాలూ అన్నీ పూర్తయిపోతున్నాయి. అదే మరి కామెడీ అంటే!

సినిమా రివ్యూ: సాహో