అరెస్ట్‌ను ఖండించిన అయ్య‌న్న శ‌త్రువు!

కోర్టుకు న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించిన కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిని, ఆయ‌న కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు గురువారం తెల్ల‌వారుజామున అరెస్ట్ చేశారు. ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టి అయ్య‌న్న‌ను వేధిస్తోంద‌ని…

కోర్టుకు న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించిన కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడిని, ఆయ‌న కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు గురువారం తెల్ల‌వారుజామున అరెస్ట్ చేశారు. ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టి అయ్య‌న్న‌ను వేధిస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అయ్య‌న్న అరెస్ట్‌ను నిర‌సిస్తూ కొన్నిచోట్ల టీడీపీ నేత‌లు నిర‌స‌న‌కు దిగారు.

ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న అరెస్ట్‌ను ఆయ‌న శ‌త్రువు ఖండించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. శ‌త్రువంటే ప్ర‌త్య‌ర్థి పార్టీ మాత్రం కాదండోయ్‌. ఆయ‌న కూడా టీడీపీ త‌ర‌పునే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయ్య‌న్నకు సంఘీభావంగా మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

అయ్యన్న అరెస్ట్‌ను ఖండిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన విధానం అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. అరెస్ట్‌కు సంబంధించి ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని ఆయ‌న వాపోయారు. అయ్య‌న్న‌ను వెంట‌నే బేష‌ర‌తుగా విడుద‌ల చేయాల‌ని గంటా శ్రీ‌నివాస‌రావు డిమాండ్ చేశారు.  

అయ్య‌న్న‌, గంటా శ్రీ‌నివాస్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. టీడీపీకిలోకి గంటా రాక‌ను గ‌తంలో అయ్య‌న్న అడ్డుకున్నారు. విశాఖ‌లో గంటా శ్రీ‌నివాస‌రావు భారీగా భూములు కొల్ల‌గొట్టార‌ని గ‌తంలో అయ్య‌న్న ఆరోపించ‌డం తీవ్ర దుమారం రేపింది. ఇద్ద‌రూ ఒకే పార్టీలోనూ, అధికారంలోనూ వున్న సంద‌ర్భంలో ప‌ర‌స్ప‌రం దూషించుకున్నారు. 

ఇటీవ‌ల కూడా గంటాపై అయ్య‌న్న ఆరోప‌ణ‌లు చేశారు. అధికారాన్ని అనుభ‌వించి, పార్టీ క‌ష్ట‌కాలంలో వున్న‌పుడు దూరంగా ఉన్నాడ‌ని, ఇలాంటి వారి వ‌ల్లే టీడీపీ న‌ష్ట‌పోతున్న‌ట్టు అయ్య‌న్న ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అయ్య‌న్న‌కు మ‌ద్ద‌తుగా గంటా నిల‌బ‌డ‌డం వెనుక ఎలాంటి రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.