గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 1న మొదటి దశ, 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. ఇప్పటికి ఆరుసగా ఐదుసార్లు గుజరాత్‌లో బీజేపీ గెలుస్తూ వస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. గుజరాత్‌లో వరుస విజయాలే మోదీని ప్రధాని పీఠం వరకూ నడిపించాయి.
దేశమంతా గుజరాత్ మోడల్ నినాదాన్ని బీజేపీ నెత్తికెత్తుకుంది. ఇందులో చాలా వరకూ బీజేపీ సక్సెస్ అయ్యింది. విజయానికి బీజేపీ పర్యాయ పదమైంది. వరుసగా రెండోసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూడా బీజేపీకి సానుకూల అంశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందాయి. ఈ దఫా గుజరాత్‌లో రాజకీయ సమీకరణలు మారాయి. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారాన్ని సొంతం చేసుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్… ఈ దఫా గుజరాత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఎలాగైనా గుజరాత్‌లో అధికారంలోకి వస్తామని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ను ఆప్ దెబ్బతీసే అవకాశాలున్నాయనే విశ్లేషకుల అభిప్రాయం. ఆప్ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి పరోక్షంగా దోహద పడుతుందా? అనేది వచ్చే నెలలో తేలిపోనుంది.