బీసీ అయితే అరెస్ట్ చేయకూడదా..?

మొత్తానికి టీడీపీ ఫైర్ బ్రాండ్ అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. మూడున్నరేళ్ళుగా ఆయన వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిని ఎపుడో దాటేశాయని చెబుతారు. సీఎం ని పట్టుకుని అనుచిత…

మొత్తానికి టీడీపీ ఫైర్ బ్రాండ్ అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. మూడున్నరేళ్ళుగా ఆయన వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిని ఎపుడో దాటేశాయని చెబుతారు. సీఎం ని పట్టుకుని అనుచిత కమెంట్స్ చేసిన అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. ఆయనకు అసభ్యపదజాలంతో విమర్శలు చేయకూడదని తెలియదా అని వైసీపీ నేతలు అంటున్నారు.

అయ్యన్న నోటి దురుసు వల్లనే ఏకంగా పన్నెండు దాకా కేసులు ఆయన మీద ఉన్నాయని నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నోటి అదుపులో పెట్టుకోలేక అయ్యన్న అనేక కేసులలో ఇరుక్కున్నారు తప్ప ప్రభుత్వాన్నికి ఆయన్ని అరెస్ట్ చేయాలన్న కక్ష ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

పోలీసులను గుడ్డలూదదీసి కొడతాను అంటే కేసు పెట్టరా, ఒక మహిళా అధికారి మీద అనుచితంగా దుర్భాషలు ఆడితే కేసు ఫైల్ చేయరా. వారూ వీరూ చూడకుండా అందరి మీద ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటే కేసు పెట్టరా అని ఉమా శంకర్ గణేష్ ప్రశ్నించారు.

ఈ రోజు అయ్యన్న మీద కేసు పెట్టింది, అరెస్ట్ చేసింది కారణం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. ప్రభుత్వ స్థలం రెండు సెంట్లను అక్రమంగా కలుపుకుని అయ్యన్న ఇల్లు కట్టారని, దానికి తప్పుడు పత్రాలు సృష్టించారని  అందువల్లనే ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు.

అయ్యన్నను అరెస్ట్ చేస్తే బీసీ నేతలను అరెస్ట్ చేస్తారా అని గొంతు చించుకుంటున్న తెలుగుదేశం వారు ఒక్కటి గ్రహించాలని, బీసీ అయినంతమాత్రాన తప్పులు చేస్తే చట్టం ఊరుకోదని ఆయన చెప్పారు. తాను కూడా బీసీ నేతనే అని, తాను తప్పు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు, కుల రాజకీయాలూ చేయడం అలవాటుగా చేసుకుందని,అందుకే బీసీ నేత అరెస్ట్ అంటూ అయ్యన్న తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో ఈ రోజు సరైన పాలన జరుగుతోంది కాబట్టే తప్పు చేసిన వారు అరెస్ట్ అవుతున్నారని ఆయన అన్నారు. మరో మూడు దశాబ్దాల పాటు ఏపీలో జగనే సీఎం గా ఉంటారని, ఈ కుల రాజకీయాలు సానుభూతి రాజకీయాలతో టీడీపీ మరింతగా దిగజరడం తప్ప ఒరిగేది ఉండదని ఆయన అంటున్నారు.