క‌ర్ణాట‌క కాంగ్రెస్.. ప్ర‌తీకార‌మా, ముందు జాగ్ర‌త్తా!

భార‌తీయ జ‌నతా పార్టీని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో చితకొట్టారు. స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నెలనాళ్ల‌కు పైగా స‌మ‌యం కేటాయించి ప్ర‌చారం చేసినా.. బీజేపీని అధికారానికి ఆమ‌డ‌దూరంలో పెట్టారు క‌న్న‌డీగులు. కాంగ్రెస్ పార్టీకి మంచి…

భార‌తీయ జ‌నతా పార్టీని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో చితకొట్టారు. స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నెలనాళ్ల‌కు పైగా స‌మ‌యం కేటాయించి ప్ర‌చారం చేసినా.. బీజేపీని అధికారానికి ఆమ‌డ‌దూరంలో పెట్టారు క‌న్న‌డీగులు. కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీతోనే అధికారం ద‌క్కింది. అయితే బీజేపీని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేద‌ని కాంగ్రెస్ అనుకుంటోందో ఏమో!

కొంత‌మంది బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం సిద్ధ‌రామ‌య్య‌తో స‌మావేశం అవుతున్నారు.  అదేమంటే.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే అని చెబుతున్నారు. అలాగే జేడీఎస్ కు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో గ‌ట్టి దెబ్బ‌త‌గల‌గా, సంప్ర‌దాయ జేడీఎస్ ఓట‌ర్ ను త‌న‌వైపుకు తిప్పుకోవ‌డంతోనే ఇంత వ‌ర‌కూ ఎదిగిన డీకే శివ‌కుమార కూడా ఇప్పుడు జేడీఎస్ త‌ర‌ఫున గెలిచిన వారిని త‌న వైపుకు తిప్పుకునే య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉన్నాడు.

కాంగ్రెస్ కు క‌ర్ణాట‌కలో స్ప‌ష్ట‌మైన మెజారిటీనే ఉన్నా.. బీజేపీ ఎలాంటి ప్ర‌య‌త్నాలు అయినా చేయ‌గ‌ల‌దు కూడా! ఒక‌వేళ 2024 ఎన్నిక‌ల్లో బీజేపీ కేంద్రంలో మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తే.. క‌ర్ణాట‌క వంటి చోట ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి బీజేపీ వెనుకాడ‌దు కూడా! త‌మ‌కు అస‌లేమాత్రం లేని చోట కూడా ప్ర‌భుత్వాల‌ను కూల్చడంలో బీజేపీ త‌న ప్రావీణ్యాన్ని చూపుతూనే ఉంది. క‌ర్ణాట‌క లో ఓట‌మి బీజేపీ అహం మీద భారీ దెబ్బ కొట్టింది.

ఇలాంటి నేప‌థ్యంలో అక్క‌డ ముందు ముందు బీజేపీ ఏవైనా ప్ర‌య‌త్నాలు చేసినా చేయ‌వ‌చ్చు. అందుకే కాబోలు.. కాంగ్రెస్ కూడా కాస్త అల‌ర్ట్ గానే ఉన్న‌ట్టుంది. వీలైతే క‌మ‌లం పార్టీ ఎమ్మెల్యేల్లో కొంద‌రిని ముందే ఇటువైపుకు తిప్పుకుని.. జేడీఎస్ ను పూర్తిగా తెర మ‌రుగు చేసే ప్ర‌య‌త్నాల‌ను కూడా ఒక‌వైపు చేస్తున్న‌ట్టుగా ఉంది. 

బీజేపీ వైఖ‌రిని ఎరిగిన కాంగ్రెస్ పార్టీ చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకోవ‌డం కంటే.. ముందే త‌న‌వంతు ప్రిప‌రేష‌న్ తో రెడీ అవుతున్న‌ట్టుగా ఉంది. కాంగ్రెస్ వైపు బీజేపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు అనే వార్త‌ల నేప‌థ్యంలో మాజీ సీఎం బొమ్మై.. ఎమ్మెల్యేల‌తో స‌మావేశాల‌ను కూడా నిర్వ‌హిస్తూ డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా చూసుకుంటున్నారు.